ఓ.పి.ఎస్. ఆకాంక్షను ఓటు ద్వారా చాటుదాం

– సి.పి.ఎస్.ఎమ్మెల్సీ అభ్యర్థి కృష్ణారావు
నవతెలంగాణ-ముధోల్ : ఉద్యోగ, ఉపాధ్యాయుల  పాత  పెన్షన్ యొక్క ఆకాంక్షను, ఆవశ్యకతను ఓటు ద్వారా చాటుదామని సి.పి.యస్ ఉపాధ్యాయ,అధ్యాపక  ఎం.ఎల్.సి.అభ్యర్థి కృష్ణారావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆయన ఉపాధ్యాయులతో సమావేశమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో రెండు లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు సి.పి.యస్. విధానంలో ఉన్నాయని, వీరందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ సాధన తో పాటు అనేక సమస్యల పరిష్కారానికి 2025 మార్చ్ లో జరగబోయే ఆదిలాబాద్ — మెదక్ -నిజామాబాద్ ఉపాధ్యాయ శాసనమండలి బరిలో సి.పి.యస్ ఉద్యోగుల తరఫున తాను బరిలో ఉంటున్నానని, తెలిపారు.మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పాత పెన్షన్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలామంది సి.పి.యస్ విధానంలో కొనసాగుతున్నారని అన్నారు .మీరంతా తమకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు. సి.పి.యస్ విధానం వచ్చి 20 సంవత్సరాలు అయిందని, త్వరలోనే రిటైర్మెంట్లు కూడా ప్రారంభమవుతాయని,వేలాదిమంది జీవితాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు అందుకే మన కుటుంబాలు భద్రంగా ఉండాలంటే ఈ సి.పి.యస్ వ్యతిరేకతను ఓటు ద్వారా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని, గతంలో గెలిచిన వాళ్ళు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love