– కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-గార్ల
మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మతోన్మాద విధానాలను అమలు చేస్తూ ప్రమాదకరంగా మారుతున్నదని, బీజేపీని నిలువరించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కందునూరి ఈశ్వర్ లింగం-కవిత దంపతుల కుమారుడు లెనిన్-యామినిల వివాహం ఇటీవల జరిగింది. కాగా మంగళవారం నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మూడవ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగంలో రచించిన లౌకిక, ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతాన్ని ప్రజల్లో బలవంతంగా రుద్దుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. సీఎంలు చంద్రబాబునాయుడు, నితీష్ కుమార్ స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి.. ప్రజలకు మొండి చేయి చూపిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన, సామాజిక, ఆర్థిక సర్వేపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని చెప్పారు. కులగణన కోసం చేపట్టిన సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు అభ్యుదయ వాదులు, సామాజిక శక్తులు, వామపక్ష పార్టీలు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.