పర్యావరణ విధ్వంసంపై గళమెత్తాలి

పర్యావరణ విధ్వంసంపై గళమెత్తాలి– చెరువులు, కుంటల కబ్జా పెను ప్రమాదం
– అడవులు అంతరించడం వల్లే కరువు, కాటకాలు : ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ లుబున సర్వత్‌
నవతెలంగాణ- ఓయూ
పర్యావరణ విధ్వంసంపై ప్రతి ఒక్కరూ గళం ఎత్తాలని ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్‌ లుబున సర్వత్‌ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని జన విజ్ఞాన వేదిక హైదరాబాద్‌ నగర కమిటీ, ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఓయూలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సెమినార్‌లో లుబున సర్వత్‌ మాట్లాడుతూ.. నగరంలో వందల సంఖ్యలో చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, తద్వారా పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జాకోరుల నుంచి చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందివ్వా లంటే నేడు సమాజంలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిర్మూలించాల్సిందేనని చెప్పారు. ప్రముఖ పర్యావరణవేత్త,ఐఐటీ శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ.. మానవుడు తన అవసరం కోసం ప్రకృతిని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో పెను విధ్వంసాన్ని కోరుకుంటున్నాడని చెప్పారు. కొందరు స్వార్ధపరులు, స్వార్ధ రాజకీయాలు, అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్య దాహం పంచభూతాలను కాలుష్య కాసారంగా మార్చుతున్నాయని చెప్పారు. ఉపరితల వనరులతోపాటు భూగర్భాలు, ఖనిజాలను విచక్షణా రహితంగా వాడటం వల్ల రానున్న రోజుల్లో కాలుష్యం పెరిగి సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అడవులు అంతరించిపోవడం వల్ల కరువు కాటకాలు సంభవిస్తున్నాయని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ సైనిక కార్యకలాపాల్లో వాడుతున్న ద్రావణాలు,ఇంధనాలు, విష రసాయనాలు పర్యావరణంలోకి విషాన్ని చేర్చుతున్నాయని వివరించారు.
జేఎన్‌టీయూ అకాడమిక్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కెఎం.లక్ష్మణరావు మాట్లాడుతూ.. విచ్చలవిడి వాహన వినియోగంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందన్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగంపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని కోరారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కోయ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణకు విద్యా ర్థులంతా నడుం బిగించాలని కోరారు. భవిష్యత్‌లో ఎండల తీవ్రత పెరగకుండా ఉండాలన్నా, కరువు, కాటకాలు రాకుండా ఉండాలన్నా,సరైన సమయంలో వర్షాలు పడాలన్నా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల సెక్రెటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ పి.రజిని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి రాజా, లింగస్వామి, అల్తాఫ్‌, సాయి, విద్యాసాగర్‌, మాణిక్యాలరావు, కళాశాల ప్రిన్సిపల్‌ ఝాన్సీ రాణి, అధ్యాపకులు ప్రమీల, సంధ్యారాణి, కిరణ్‌ మై, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love