బహిరంగంగా మాట్లాడుకుందాం…

     అన్య విగ్‌… చిన్నప్పటి నుంచి ఉద్యోగం, ఇల్లు, బయట పనులు చూసుకుంటూ ఎప్పుడూ బిజీగా ఉండే తన తల్లిని చూస్తూ పెరిగింది. ఏదో సాధించాలనే కోరికలను మనసులోనే అదిమిపెట్టడం గమనించింది. తాను బాల్యం నుండి యుక్తవయసుకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం మహిళలను చూసే విధానాన్ని అర్థం చేసుకుంది. ఈ సమాజానికి మహిళల సామర్థ్యాల పట్ల అవగాహన లేదని గ్రహించింది. లింగ వివక్ష, మూస పద్ధతులు, శారీరక అడ్డంకుల వల్ల మహిళలు కూడా తమలోని సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించలేక పోతున్నా రనుకుంది. దీనికి రుతుస్రావం ఒక ముఖ్య కారణమని గ్రహించింది. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు ఒక మిషన్‌ను ప్రారంభించింది. ఈ రోజు రుతు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఆమె చేస్తున్న కృషి గురించి తెలుసుకుందాం…
అన్య తన స్నేహితురాలు సౌమ్య సింఘాల్‌తో కలిసి లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం పనిచేసే ‘హర్‌ హక్‌’ (ఆమె హక్కు) అనే స్వచ్ఛంధ సంస్థను ఢిల్లీలో ప్రారంభించింది. ”స్త్రీలను నేను ఏవిధంగా అయితే చూస్తున్నానో ప్రపంచం కూడా అలాగే చూసేలా చేయాలనుకుంటున్నాను. దానికోసమే హర్‌ హక్‌ పుట్టింది” అని అన్య చెప్పారు.
యువజన సంఘం ప్రారంభించి
తాను చేసే పని సమాజంపై కొంతైనా ప్రభావం చూపాలని కోరుకుంది అన్య. లాయర్‌, జర్నలిస్ట్‌, పోలీసు అధికారి ఇలా ఎన్నో అవ్వాలని ఆమె కలలు కనేది. అయితే కాలక్రమేణా ఈ రంగాల్లో పని చేయకుండానే సమాజంలో తాను కోరుకున్న మార్పును తీసుకురాగలనని ఆమె భావించింది. 2018లో ఢిల్లీ యూనివర్శిటీలోని లేడీ శ్రీ రామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌లో చేరింది. అప్పుడే మహిళల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే తన కలను నెరవేర్చుకోవడం ప్రారంభించింది. అతి తక్కువ సమయంలోనే ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2019లో ‘గర్ల్స్‌ అప్‌ రైజ్‌ ఇనిషియేటివ్‌’ అనే యువజన సంఘం ప్రారంభించింది.
పీరియడ్స్‌పై అవగాహన లేదు
‘గర్ల్స్‌ అప్‌ రైజ్‌ ఇనిషియేటివ్‌’ మహిళల్లో రుతుక్రమ పరిశుభ్రతను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. రుతు పరిశుభ్రత, దాని గురించి అవగాహన పెంపొందించే విషయంలో అమ్మాయిలకు ఆసక్తి లేకపోవడం గుర్తించింది. దానికి కారణం రుతుపరిశుభ్రతకు అనుగుణమైన విద్య లేకపోవడం అని ఆమె గ్రహించింది. ”దేశంలో రుతుస్రావ పేదరికం తీవ్రంగా ఉంది. కానీ అది చర్చకు రావడం లేదు. ఇక్కడ సమస్య కేవలం రుతుక్రమ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడమే కాదు, పీరియడ్స్‌ గురించి అవగాహన లేకపోవడం కూడా” అని అన్య చెప్పారు.
మూడు అంశాలపై కేంద్రీకరించారు
అన్య సెప్టెంబర్‌ 2022 వరకు రుతుశుభ్ర ప్రోగ్రామ్‌ కోసం పని చేశారు. అయితే ఆ తర్వాత ఆమె యూత్‌ కలెక్టివ్‌ను పూర్తి స్థాయి ఎన్‌జీఓగా మార్చాలని, దాని పని మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని భావించింది. ఇదే ‘హర్‌ హక్‌’ ను స్థాపించడానికి దారితీసింది. ఇప్పుడు ‘హర్‌ హక్‌’ మూడు అంశాలపై పనిచేస్తుంది. అవే రుతు పరిశుభ్రత నిర్వహణ, చట్టపరమైన, ఆర్థిక అక్షరాస్యత. రుతు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి ఎన్‌జీఓ ఢిల్లీ అంతటా ఆఫ్‌లైన్‌ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. ఈ వర్క్‌షాప్‌లో పీరియడ్స్‌ సమయంలో పరిశుభ్రత కోసం మహిళలు ఏమి ఉపయోగించాలి, పీరియడ్స్‌ చుట్టూ ఉన్న అపోహలు, కళంకం, PCOS, ఎండోమెట్రియోసిస్‌ వంటి పునరుత్పత్తి సమస్యల గురించి చర్చిస్తారు.
రుతు విద్యను అందిస్తున్నాం
”మేము ఈ వర్క్‌షాప్‌లను సరదాగా నడిపించడం కోసం వారి వయసుకు తగ్గట్టు ఆసక్తికరమైన ఆటలను కూడా చేర్చాము” అని అన్య చెప్పారు. గర్ల్‌ అప్‌ రైజ్‌ కింద 8 మార్చి 2021న ప్రారంభించబడిన వారి #SpotTheStigma ప్రచారం కింద వారు మహిళలకు శానిటరీ ప్యాడ్స్‌, రుతుక్రమ విద్యను అందించారు. ఇప్పటి వరకు 10 వేలకు పైగా శానిటరీ న్యాప్‌కిన్లు పంపిణీ చేశామన్నారు. 18 ఏండ్లకే సంపాదించడం ప్రారంభించిన అన్య మహిళలు ఆర్థిక వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించడం, వారి చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకోవడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక అవగాహన కూడా…
”పన్నులు ఎలా ఫైల్‌ చేయాలి, నా డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అంటే ఏమిటి, నా భవిష్యత్తును ఎలా ప్లాన్‌ చేసుకోవాలి వంటి ప్రాథమికమైన వాటిని ఎవరూ నాకు చెప్పలేదు. మహిళలు ఈ పనులను చేయడానికి భర్తలపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే మహిళలు తమ సంపాదనపై మరింత నియంత్రణ కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. దీనివల్ల వారు తమ భవిష్యత్తును ప్లాన్‌ చేసుకోవచ్చు” అంటారు అన్య.
వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ…
హిళల్లో చట్టపరమైన, ఆర్థిక అక్షరాస్యతను వ్యాప్తి చేయడానికి సంస్థ ఆఫ్‌లైన్‌ వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తోంది. అలాగే వ్యక్తిగత ఆర్థిక, బడ్జెట్‌, పన్ను ప్రణాళిక, సైబర్‌ నేరాలు, లైంగిక వేధింపుల చట్టాలతో సహా వివిధ అంశాలపై వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి నిపుణులను తీసుకువస్తుంది. వారు విద్యార్థుల రుణాలు, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయడానికి సంబంధించిన సెమినార్‌లను కూడా నిర్వహిస్తారు. 80 మందికి పైగా వాలంటీర్లతో పాటు సుమారు 500 మంది నిపుణులు బయట నుండి వచ్చి వర్క్‌షాప్‌లో అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది మార్చి నెలలో ఎన్‌జీఓ ఢిల్లీలోని యునైటెడ్‌ స్టేట్స్‌ ఎంబసీ సహకారంతో POSH వర్క్‌షాప్‌ నిర్వహించింది.
దెబ్బతినేందుకు సిద్ధంగా ఉండండి
”మీరు గాజు పైకప్పును పగలగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, గాజు కూడా పడిపోతుంది. కాబట్టి దెబ్బతినడానికి సిద్ధంగా ఉండండి. అంటే మనం కనిపించని సంకెళ్ళను తెంచేందుకు పూనుకుంటే సమాజం దానికి పూర్తి మద్దతు ఇవ్వదు. కాబట్టి కొన్ని ఎదురు దెబ్బలు తప్పవు. వాటిని భరించడానికి సిద్ధంగా ఉంటేనే అనుకున్న లక్ష్యం చేరగలం’ అని ఆమె అంటుంది. ఈ రోజు రుతు పరిశుభ్రత దినోత్సవం కాబట్టి అన్య ఢిల్లీలో ఆఫ్‌లైన్‌ డ్రైవ్‌ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. కనీసం 800 శానిటరీ ప్యాడ్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ”ప్రతి స్త్రీకి వినిపించే ఆదర్శవంతమైన ప్రపంచాన్ని నేను సృష్టించాలనుకుంటున్నాను. ఆ కలను నిజం చేయడానికే ‘హర్‌ హక్‌’ వేస్తున్న ఒక చిన్న అడుగు” అంటూ ఆమె తన మాటలు ముగించింది.
అడ్డంకులు కూడా ఉన్నాయి
అన్య రుతు పరిశుభ్రత గురించి పని చేయడం ప్రారంభించినప్పుడు ప్రజలు ఎన్నో రకాలుగా స్పందించారని ఆమె గుర్తుచేసుకున్నారు. ”కొంతమంది మేము చెప్పే విషయాలను స్వీకరించేవారు, రుతుస్రావం గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొంత మంది నుండి ప్రతి ఘటనను కూడా ఎదుర్కొన్నాను. నేను వెళ్ళిన కొన్ని పాఠశాలలు పీరియడ్‌లను బహిరంగంగా చర్చించాల్సిన అంశంగా భావించలేదు. వర్క్‌షాప్‌లు తీసుకోవడానికి ఒప్పుకోలేదు” అని అన్య చెప్పారు. అంతే కాదు కొంత మంది ఆమెను నిరుత్సాహ పరిచారు. అయితే ఈ అడ్డంకులేవీ ఆమెను ఆపలేకపోయాయి.
– సలీమ

Spread the love