కలిసి పనిచేద్దాం

Let's work together– అమెరికా నుంచి ప్రధాని మోడీ పోస్ట్‌
– జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్‌, ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసితో భేటీ
– నిఘా సహకారం పెంపుపై చర్చలు
వాషింగ్టన్‌: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ వాల్జ్‌, ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌తో ప్రధాని నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని గురువారం ఆయన అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షుడు ట్రంప్‌తో పాటూ ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామిలతో సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశముంది. వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా మైఖేల్‌ వాల్జ్‌, తులసి గబ్బార్డ్‌తో మోడీ విడివిడిగా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య గల వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య తీవ్రవాద నిరోధక కార్యకలాపాల్లో నిఘా సహకారాన్ని మరింత పెంచాల్సిన అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. సైబర్‌ భద్రతతో సహా ముంచుకువస్తున్న పలు ముప్పులను ఎదుర్కొనడంలో కూడా సహకారం వుండాలని పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత నిఘా అధికారిగా బాధ్యతలు చేపట్టిన హిందూ అమెరికన్‌ తులసి గబ్బార్డ్‌ను మోడీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడి అతిథి గృహమైన బ్లెయర్‌ హౌస్‌లో బస చేసిన మోడీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతున్నారు. అనంతరం ఇరువురు నేతలు కలిసి సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొంటారని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Spread the love