శ్రీమతికో లేఖ

బుజ్జమ్మా..
ఇది నీకోసమే..
నీతో చెప్పాలనుకున్న మాటలు కొన్నింటిని ఇలా కాగితంపై కల్లాపి చల్లాను.. చూస్తావు కదూ…
జీవితంలో నాకు నేనే వద్దనుకున్న రోజుల్లో, నీకు నేను కావాలంటూ నా ముందు ప్రత్యక్షమయ్యావ్‌ పున్నమి పువ్వులా
ఆ క్షణం.. నాక్కూడా నువ్వు కావాలనిపించావ్‌, కానీ నే అనుకోలేదప్పుడు నీతో జీవితం ఇంత అందంగా.. కాదు కాదు.. ఇంత ఆనందంగా ఉంటుందని..
ఇప్పుడేమనిపిస్తోందో తెలుసా? ఇంకొన్నేళ్ల ముందే నిన్ను నేనెందుకు కలవలేదూ అని…
నిన్న మొన్నటి వరకూ నాకంటూ కొన్ని ఆలోచనలుండేవి.
కొందరు మనుషులు ఎప్పటికీ కలవని సమాంతర రేఖల్లాంటివారని అనుకునే టోడ్ని. అందుకేనేమో కొంత కాలం కొన్ని బంధాలకు, ఇంకొందరి మనుషులకు దూరంగా ఉన్నాను. కానీ అది ఒట్టి అపోహేనని నువ్వు చెప్పకనే చెప్పావ్‌.
ఎన్నో వైరుధ్యాలున్న ఈ మనుషులతో ఇంత కలివిడిగా, ఎంతో ప్రేమగా నీలాగా వుండగలగటం అంత సులువేం కాదు. అందుకింకేదో మంత్రం తెలిసుండాలి అమ్మడు నీకు.
పెళ్లికి ముందు వరకూ నేను ఒంటరిగానే ఉండేవాడ్ని. నా పనేదో నాది. లేవడం, ఫ్రెషవ్వడం, వర్క్‌లోకి వెళ్లడం, తిరిగి రావడం, ఫ్రెష్షవడం, కాసేపు మొబైల్‌ చూసి మళ్ళీ బజ్జోవడం. ఇదే నా లైఫ్‌ టైం టేబుల్‌లా ఉండేది. మూడు పదులు దాటేస్తున్నా ఇంకా లైఫ్‌లో ఏమీ సాధించలేదు కదా, కనీసం అమ్మానాన్నలకు ఏమాత్రం చేయూత కాలేకపోయానే, ప్రేమలో కూడా ఓడిపోయాను, అంతా అయిపోయింది ఇంక ఈ లైఫ్‌ నాకు వద్దనుకుని సూసైడ్‌ అటెమ్ట్‌ కూడా చేసి మళ్లీ వెనుకడుగేసిన జీవితం నాది. అలాంటి ఏమీ లేని, ఎవ్వరికీ ఏమీకాని ఈ ఏకాకి బతుకులోకి ఏక్‌ దమ్‌ భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా లక్కు చిక్కినట్టు దొరికావ్‌. ఆ క్షణం నుంచి ఈ షణ్ముఖ్‌ గాడి జిందగీ ఫేటే మారిపోయింది.
ఇప్పుడు నేనో రారాజుని. నా కోసం ఓ రాణుంది. నా యువరాణి ఉంది.
అందం, అణకువ ఉన్న ఐదున్నరడుగుల ప్రేమ స్వరూపం.
నన్ను, నా కుటుంబాన్ని, నా ఇంటిని తన నెత్తిన పెట్టుకు నడిపిస్తున్న ధరణి, నా బ్రతుకు పాటను ఓ ”శృతి” లో నడిపే అందమైన తరుణి.
నీ గురించి ఏం చెప్పను..? ఎన్ని కష్టాల్ని దాటొచ్చిన జీవితమో గానీ, అవతలివారు బాధించినా కూడా సరిగా ప్రతిస్పందించడమో, లేక నిందించడమో తెలియని పసిమనసువి. నీకు చేతగాని పనంటూ లేదు, అన్నింట్లో ఆరితేరావ్‌, కొన్నింటిని భరించాలన్నా కూడా ఎవరైనా నీ తర్వాతనే.
నువ్వూ… అచ్చు అవని లెక్క అమ్మడు..
రోజుకోసారి ఏదో కారణంగా అలకల పల్లకీపై కూర్చుంటావ్‌, నేను నా బుజ్జమ్మను బుజ్జగించాలని ప్రయత్నిస్తాను. వెనువెంటనే బుంగమూతి పెడతావ్‌. గట్టిగా ఓ కసురు కసరాలననిపిస్తుంది ఇంతలోనే ఆ బుంగమూతి నుంచి ఓ అరనవ్వు విసురుతావ్‌. ఇంకేముంది నా మనసు గగనంలో గర్జనలాగి, వెంటనే నా నుంచి ప్రతినవ్వు పూలవర్షమై కురుస్తుంది నీ ముంగిట. ఇలా నీ రెండు పదుల పసితనానికి నేనెప్పుడో నీ ఫ్యానయ్యా. ఇయ్యాల నేను నీ అభిమాన సంఘాధ్యక్షుడ్ని, నీ ప్రేమాలయ పూజారిని, నా దేవేరికి దొరికిన నీ మామూలు శ్రీవారిని…
ట్రస్టు మీ బంగారం You Are Complete. నువ్వు నీలాగే ఉండాలి. ఇలాగే అందమైన కలలు కనాలి. గప్పుచిప్పు గంతులేయాలి, అల్లరల్లరిగా చిందులేయాలి, అప్పుడప్పుడూ అలగాలి, మారామ్‌ చేయాలి. కుదిరితే రెక్కలు కట్టుకుని మబ్బుల్లోకెగిరిపోవాలి. పడితే దెబ్బలు తగుల్తాయని హెచ్చరిస్తుంటాన్నేను. అస్సలు పట్టించుకోవద్దు. ఊరికూరికే నీతో గొడవపడతుంటాను గానీ, అయినా..! నువ్వు గెలిస్తేనే నాకెక్కువ సంతోషమన్న సంగతి నీక్కూడా తెలుసులే. యాద్‌ రఖో బుజ్జమ్మా… మన లైఫ్‌ మన చేతిలోనే ఉంటుంది. అందుకే చెబుతున్నా… రోజూ నువ్వు ఆనందంగా ఉండాలి. నీ మనసుకు నచ్చినట్టుగా ఉండాలి. కొన్ని అనుకున్నట్టుగా జరుగుతారు. ఇంకొన్ని ఆటోమేటిక్‌గా జరుగుతారు. కానీ ఏం జరిగినా సరే టేకిటీజీ అని బ్రతికేయడమే జీవితం…
బైదిబై… పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మా (నీకు + నాక్కూడా)
ఇట్లు
నీ శ్రీవారు

Spread the love