గ్రంథాలయ సేవలు విస్తృత పరచాలి

తెలంగాణ రాష్ట్రంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు పట్టణ ప్రాంతాలకు లేదా హైదరాబాద్‌ రాష్ట్ర రాజధానికి వచ్చి శిక్షణ పొందడానికో, చదువుకోడానికో రీడింగ్‌ రూమ్‌కు వెళ్ళే ఆర్థిక స్తోమత వుండదు. అలా అనేక మంది నిరుద్యోగ యువత గ్రంథాలయాలపై ఆధారపడుతున్నారు. వాస్తవానికి ఈ మొత్తం నిరుద్యోగ యువతకు ఇప్పుడున్న గ్రంథాలయాలు సరిపోవు. ఒకవేళ గ్రంథాలయాలు ఉన్నా జిల్లా కేంద్ర గ్రంథాలయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా వచ్చే చదువరుల అవసరాలను (కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి) తీర్చే విధంగా ఉండాలి. ప్రస్తుత పోటీ పరీక్షల నేపథ్యంలో మన లైబ్రరీల స్థితిగతులను పరిశీలిద్దాం…

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో ఉద్యోగ ప్రకటనల నిమిత్తం నిరుద్యోగ యువత ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యే పరిస్థితులను పరిశీలిస్తే గ్రూప్‌ 1, గ్రూప్‌ -2, వెటర్నరీ సివిల్‌ సర్జన్స్‌, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, ఎన్స్‌పెన్షన్‌ ఆఫీసర్స్‌ ఇన్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, జూనియర్‌ కళాశాలలో గ్రంథ పాలకులు, ఫిజికల్‌ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌, అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, గ్రూప్‌ 3 ఆఫీసర్స్‌, గ్రూప్‌ 4 ఉద్యోగాలు, కోర్టులలో ఉద్యోగాలు, పోలీస్‌ కానిస్టేబుల్స్‌, సబ్‌ ఇన్‌ స్పెక్టర్స్‌, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలో, పాలిటెక్నిక్‌ కళా శాల్లో ఉపాధ్యాయులు, ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాలు 43వేల పైచిలుకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌, బ్యాంక్‌ ఆఫీసర్స్‌, క్లర్క్స్‌, రైల్వే ఉద్యోగాలు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్‌, పోస్టల్‌ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని యువత సన్నద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో యువత చదవ డానికి ఉపయోగిస్తున్న పఠనాలయాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాఖ గ్రంథాల యాలు 537, జిల్లా కేంద్ర గ్రంథాలయాలు 33 (దాదాపు 20 అన్ని హంగులతో కూడిన నూతన భవనాలు), ప్రాంతీయ గ్రంథాలయాలు 3, రీడింగ్‌ హాల్స్‌ 440 ఉన్నాయి. దాదాపు 500 పైగా బుక్‌ డిపాజిట్‌ సెంటర్లుండేవి. ప్రస్తుతం కొన్ని సాంకేతిక కారణాల వల్ల అనుకున్నంత స్థాయిలో సేవలందించడం లేదు. అదేవిధంగా 300 పైచిలుకు స్వచ్ఛంద గ్రంథాలయాలు (ప్రైవేటు వ్యక్తులచే నడపబడే ఉచిత గ్రంథాల యాలు) వున్నాయి. ఉదాహరణకు వేములవాడ వీరగోని ఆంజనేయులుగౌడ్‌ గ్రంథాలయం, సత్యవతి గ్రంథాలయం మిర్యాలగూడ, గుండ్రం పల్లి గ్రంథాలయం, బాలాజీ తండా గ్రంథా లయం కోదాడ, ఆదర్శ గ్రంథాలయం పెడ మాడురు, ముల్కలపల్లి గ్రంథాలయం, ఖమ్మం పారుపల్లి వారి పుస్తకపు తోట గ్రంథాలయం… ఇలాంటివి గత రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి.
స్వచ్ఛందంగా గ్రంథాలయాలు నడిపే ఔత్సా హికులకు తగిన సహాయ సహకారాలు, మౌలిక సదుపాయాలు, న్యూస్‌ పేపర్లు, కనీస పుస్తక సంపదను అందించి నిరుద్యోగ యువతకు రీడింగ్‌రూం సదుపాయాన్ని కల్పించాలి. అవసర మైతే నూతనంగా గ్రంథాలయాలు నడిపే వారికి ప్రోత్సాహకాన్ని అందించాలి.
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైచిలుకు సభ్యత్వాలు పౌర గ్రంథాలయాల్లో వున్నాయి. ఇంకనూ ఈ సభ్యత్వాల సంఖ్య పెరగాలి. గ్రంథా లయాలను వినియోగించుకోవాల్సి ఉంది. లుక్‌ కల్చర్‌ నుండి బుక్‌ కల్చర్‌కు యువతను అనుసంధానం చేయవలసిన అవసరం ఉన్నది.
ముఖ్యంగా ప్రస్తుతం పోటీ పరీక్షల వాతా వరణం సందర్భంగా నిరుద్యోగ యువత ఎక్కువగా తెలుగు అకాడమీ పోటీ పరీక్షల పుస్తకాలు, డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయ పుస్త కాలు, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు పోలీస్‌ కానిస్టే బుల్‌, ఎస్సై, గ్రూప్‌ 4, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 1 జూనియర్‌ లెక్చరర్స్‌, డిగ్రీ లెక్చరర్స్‌ పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. అవసర మైతే గ్రంథాలయాల పని గంటలు, గ్రంథ పాలకుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్నది
2021లో 7069 పుస్తకాలను, 2022లో 9,50,042 పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం 68 లక్షల పుస్త కాలు అందుబాటులో ఉన్నాయని అంచనా. ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉన్న పుస్తకాలు అనుకున్న స్థాయిలో సరిపోవడం లేదు. ఇంకా పుస్తకాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాలలో పుస్తకాలు నిరుద్యోగ యువతకు అందు బాటులో ఉంచాల్సిన అవసరమున్నది. ప్రస్తుతం తెలుగు పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలా కాకుండా ఆంగ్ల మాధ్యమంలో కూడా ఉంచే ప్రయత్నం చేయాలి.
వీటితోపాటు పోటీపరీక్షల పత్రికలు కాంపిటీటివ్‌ సక్సెస్‌ రివ్యూ, విజేత కాంపిటీషన్‌, ఆర్‌ సి రెడ్డి పబ్లికేషన్‌, షైన్‌ పబ్లికేషన్స్‌, కెరియర్‌ క్రాని కల్‌, యోజన, సివిల్‌ సర్వీస్‌ క్రానికల్‌, ప్రతి యోగితాదర్పణ, ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌, బ్యాంక్‌ క్రానికల్‌, తెలంగాణ మాసపత్రిక వంటి పోటీ పరీక్షల దినపత్రికలు అన్ని గ్రంథాలయా లలో అందుబాటులో ఉంచాలి.
గ్రంథాలయ పన్ను నుండి వచ్చే నిధులు పూర్తిగా గ్రంథాలయాల మౌలిక సదుపాయాలు, పుస్తకాలు, జర్నల్స్‌, పఠణ మందిరాలాభివద్ధికి, వాటి సేవలను విస్తత పరిచేందుకు కేటాయించాలి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అదనపు నిధులను కేటాయించి వాటి ఉన్నతకి కషి చేయాలి. కేవలం పట్టణ, జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర రాజధానిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాల విస్తరణ జరగాలి. ప్రతి నిరుద్యోగ యువతకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి.
ప్రభుత్వం ‘పబ్లిక్‌ రీడింగ్‌ రూమ్‌ (పౌర పఠనాలయం)’ అనే విన్నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. కానీ, ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమంటే ఎవరైనా ఔత్సాహికులు ఉచితంగా (అద్దె లేకుండా) గదులు ఇస్తే, ప్రభుత్వం కొన్ని పుస్తకాలతో తాత్కాలిక ప్రాతిపదికన గ్రంథాలయాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తామని చెప్పడం. మండల, పట్టణ, రాష్ట్ర రాజధాని ప్రజలు మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా గ్రంథాలయాల పన్ను చెల్లిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ సేవలు అందరికీ సరైన ప్రాతిపాదికన అందించాల్సిన ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌ డిజిటల్‌ గ్రంథాలయాలు అనే పేరుతో ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్‌ గ్రంథాలయాలను దాదాపు 4000 పైచిలుకు ఏర్పాటుకు ప్రయత్నం చేసింది. దాదాపు 800 నూతన గ్రంథాలయ భవనాలు ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఒక రీడింగ్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేందుకు, పిల్లలు, మహిళలు, వద్ధులు దినపత్రికలు, బొమ్మల పుస్తకాలు చదివేందుకు రీడింగ్‌ రూమ్‌లో కనీస సౌకర్యాలు (మంచినీటి వసతి, ఫ్యాన్లు, టేబుల్స్‌, కుర్చీలు, కనీస పుస్తకాలు) అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ గ్రంథాలయాలకు దినపత్రికలు, పుస్తకాలు, కరెంట్‌ బిల్లులకు డబ్బులు ఎలా ఖర్చు పెడుతుందో అదేవిధంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న పబ్లిక్‌ రీడింగ్‌ రూముల్లో, స్వచ్ఛంద గ్రంథాలయాలలో కనీస బడ్జెట్‌ కేటాయించాలి.
గ్రామాల్లో పఠన మందిరాలు 2500పైగా జనాభా కలిగినటువంటి గ్రామాలకు మాత్రమే ఏర్పాటు చేస్తామని, నెలకు రూ.2 వేలు మాత్రమే నిర్వహణ, దినపత్రికలకు కేటాయించాలని చెప్పారు. అలా కాకుండా ప్రతి గ్రామ పంచాయితీలలో పఠన మందిరాలు ఏర్పాటు చేయాలి. చదువరులకు కావలసిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. పబ్లిక్‌ రీడింగ్‌ రూమ్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరిచి వాటి సేవలు అందరికి అందుబాటులో ఉంచాలి.
రెండు తెలుగు రాష్ట్రాలలో గమనిస్తే… గత రెండున్నర దశాబ్దాలుగా మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. శిక్షణ పొందిన గ్రంథపాలకుల నియామకం చేపడితే వాళ్ళు చదువరులకు కావాల్సిన సమాచారాన్ని సరైన సమయంలో అందిస్తారు.
ఉద్యోగ ప్రకటనలో భాగంగా జిల్లా కేంద్ర, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాలలో ‘ఆన్‌ డిమాండ్‌ బుక్స్‌ సిస్టం (చదువరి కోరిన పుస్తకాన్ని అందించడం)’ మంచి పరిణామం. ఇది అన్ని గ్రంథాలయాలకు అనువర్తింప చేయాలి. జిల్లా కేంద్రం, పట్టణ ప్రాంత గ్రంథాలయాల్లో నెలకు రూ.50 వేలు పరిమితిని ఎత్తివేసి పాఠకులకు కావలసిన పుస్తకాలను తెప్పించే ప్రయత్నం శుభ పరిణామం.
ప్రతి ఏడాది రాజా రామ్మోహన్‌రారు లైబ్రరీ ఫౌండేషన్‌, కలకత్తా వారు ఇచ్చే ఆర్థిక వనరుల మీద ఆధారపడి పుస్తకాలు ఖరీదు చేస్తున్నారు. ఆ పుస్తకాలలో కూడా ప్రస్తుత చదువరుల అవసరాలకు అనుగుణంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే, ఉన్నత విద్యలకు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ప్రస్తుత సమాజానికి ఏదైతే అవసరమో అలాంటి కోర్సులకు సంబంధించిన పుస్తకాలను తెప్పించే ప్రయత్నం చేయాలి.
అదేవిధంగా కేరళ రాష్ట్రంలో పౌరా గ్రంథాలయాలు వివిధ వినూత్న కార్యక్రమాల ద్వారా (బుక్‌ హగ్‌, బుక్‌ హంట్‌, లైబ్రరీ డౌరీ, గిఫ్ట్‌ ఎ బుక్‌, లవ్‌ యువర్‌ బుక్‌, లవ్‌ యువర్‌ లైబ్రరీ) ప్రజల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులను, యువతను ప్రభావితం చేసే విధంగా నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ, కర్ణాటక, ఒరిస్సా, అస్సాం వంటి రాష్ట్రాలలో గ్రంథాలయాలను కేవలం పఠణాలయాలు గానే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే మల్టీ సర్వీసెస్‌ సెంటర్‌గా మార్చి, అన్ని వయసుల ప్రజలు గ్రంథాల యాలను అందిపుచ్చుకునేలా రూపొందిస్తున్నారు.
ఇలా అన్ని రాష్ట్రాలు కేవలం రాజా రామ్మోహన్‌రారు లైబ్రరీ ఫౌండేషన్‌ వారు ఇచ్చే నిధుల మీదనే ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి చదువరులకు ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి నిరుద్యోగ యువత ప్రస్తుత గ్రంథాలయాల సామర్థ్యం కంటే మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉంది. దానికి ప్రభుత్వం కానీ, ఆ ప్రాంతంలోని విద్యావంతులు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ అందుబాటులో ఉన్న విశ్వవిద్యాలయాల సమావేశ మందిరాల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమావేశ మందిరాలలో, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం పూట, ఫంక్షన్‌ హాల్స్‌, సమావేశ మందిరాలను, రైతు కేంద్రాలను, మహిళా కేంద్రాలను తీసుకొని నిరుద్యోగ యువతకు రీడింగ్‌ రూముల్లాగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి.
వాటితో పాటు అవసరమైతే జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో కానీ, ప్రాంతీయ కేంద్ర గ్రంథాలయాల్లో కానీ, పట్టణ గ్రంథాలయాల్లో కానీ బీసీ.స్టడీసర్కిల్‌, ఎస్సీ స్టడీసర్కిల్‌ తో; నిపుణులైన ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో ఒప్పందం కుదుర్చుకొని ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులచే ఉచిత శిక్షణ సౌకర్యాలను నిరుద్యోగులకు కల్పించే ప్రయత్నం చేయాలి.
మారుతున్న కాలంతో పాటు గ్రంథాలయాల స్వరూపం (ఫిజికల్‌ టు డిజిటల్‌) మార్చుకుంటూ చదువరికి కావలసిన సమాచారాన్ని నిత్యం అందించేందుకు ప్రయత్నం చేయాలి. మారుతున్న కాలానుగుణంగా గ్రంథాలయాల సేవలు కూడా రీడింగ్‌ రూమ్‌ కోసం మాత్రమే కాకుండా పుస్తకాలు, పత్రికలు, అంతర్జాల సౌకర్యం, జిరాక్స్‌, స్కానింగ్‌, కరెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌, ఉద్యోగాల సమాచారం, విద్యా సమాచారం, ప్రభుత్వ పథకాల సమాచారం, ఉపాధి అవకాశాల సమాచారం, సాంకేతిక విషయాల మీద అవగాహన కొరకు కావలసిన సమాచారం, నిరుద్యోగ యువతకు, పిల్లలకు, మహిళలకు, వయోవద్ధులకు కావలసిన వివిధ అంశాల మీద విస్తత ఉపన్యాసం ఏర్పాటు చేసి జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి.
రాష్ట్రాలలో గ్రంథాలయాలు ఏర్పాటు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అర్హత కలిగిన గ్రంథపాలకుల నియామకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉన్నది. లక్షలాది, కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రంథాలయ భవన నిర్మాణం జరుగుతున్నప్పటికీ పాఠకులకు సమాచారాన్ని చేర్చేవారుదులైన గ్రంథ పాలకులు లేకపోవడం శోచనీయం. గ్రంథాలయాలు అందరివి. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన అవసరం ఉన్నది.
– డా|| రవికుమార్‌ చేగొని,
9866928327

Spread the love