అతడు ఓ నిరుపేద చెప్పులు కుట్టే కుటుంబంలో పుట్టాడు. విధి వక్రీకరించి కంటికి గాయమై ఐదేండ్లకే కంటిచూపు పోగొట్టుకున్నాడు. అందమైన లోకాన్ని తానిక చూడలేననే సంగతి తెలిసి కుమిలిపోయాడు. అయితే 15 ఏండ్లు వచ్చేసరికి ఆ బాలుడే అంధ విద్యార్థులూ చదువుకునేలా ఓ లిపిని తయారు చేసి, దానిని మరింత ఆధునీకరించాడు. అతడే లూయీస్ బ్రెయిల్.. అతని లిపి బ్రెయిలీ. అతని పేరు మీదుగానే ఆ లిపిని పిలుస్తున్నారు. జనవరి 4 ఆయన జయంతి సందర్భంగా..
లూయిస్ బ్రెయిల్.. ప్రపంచంలోని అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక ప్రముఖ వ్యక్తి. 1809 జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. తండ్రి చర్మకారుడు. లూయిస్ మూడేండ్ల వయసులో తండ్రి వర్క్ షాప్‌లో ఆడుతూ ప్రమాదవశాత్తూ కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయారు. చిన్న వయసులోనే తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని కేవలం భావనల ద్వారా గ్రహించాల్సి వచ్చింది. తన పరిస్థితికి వెరవకుండా తన లాంటి వారి కోసం ఏదొకటి చేయాలన్న తపనే బ్రెయిలీ లిపికి పునాది అయింది.
విద్యార్జనలో ప్రతిభ
అంధుల పాఠశాల అయిన ”రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్” లో చేరిన లూయిస్, విద్యాభ్యాసం కొనసాగించారు. అప్పట్లో అంధులకు పఠనానికి అవసరమైన సామగ్రి తక్కువగా ఉండేది. ఈ సమస్యను గుర్తించిన లూయిస్, తాను దీనికి పరిష్కారం చూపాలని సంకల్పించారు. అంధుల కోసం ప్రత్యేకమైన పఠన విధానాల కొరతను గుర్తించి వాటిని మెరుగుపరచడం గురించి ఆలోచించారు.
బ్రెయిలీ లిపి ఆవిష్కరణ
1819లో లూయిస్, నెపోలియన్ ఆర్మీ కోసం రూపొందించిన నైట్ రైటింగ్ సిస్టమ్‌ను గురించి తెలిసి, దానిని ఆధారంగా చేసుకొని అంధుల కోసం సులభమైన బ్రెయిలీ లిపిని రూపొందించారు. సులభ పఠనం, రచనకు అనుకూలంగా ఈ లిపిని 1824లో ఆవిష్కరించారు. ఇది ఒక ప్రత్యేకమైన అక్షరమాల పద్ధతి. ఇందులో ఆరు పాయింట్ల నుంచి వివిధ సమీకరణల ద్వారా అక్షరాలు, అంకెలు, ఇతర చిహ్నాలను సష్టించవచ్చు. ఈ పద్ధతి అంధులకు చదివేందుకేగాక, రచనలు చేసేందుకు కూడా దోహదం చేసింది.
లిపి ప్రత్యేకత
బ్రెయిలీ లిపి కేవలం పఠనానికి మాత్రమే కాదు, సంగీత నోటేషన్లు, గణిత సూచనలు, శాస్త్రీయ సమాచారాన్ని అందించడానికీ ఉపయోగ పడుతుంది. ఇది అంధులకు ప్రపంచ విజ్ఞానానికి తలుపులు తెరిచింది. ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అంగీకరించడంతో పాటు, ప్రతీ అంధుల విద్యా వ్యవస్థలో అమల్లోకి వచ్చింది. తద్వారా వారు చదవడం, రాయడంతో పాటు ఆలోచనలను వ్యక్తపరిచేందుకు, స్వతంత్రంగా జీవించగల సామర్థ్యాన్ని అందించింది.
మరణం తర్వాత గుర్తింపు
లూయిస్ బ్రెయిల్ 43 ఏండ్ల వయసులో 1852లో క్షయవ్యాధి కారణంగా మరణించారు. ఆయన బతికుండగా ఈ లిపి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ఆయన మరణానంతరం రెండేండ్లకు 1854లో ఈ ఆల్ఫాబెట్ సిస్టమ్‌ని ఫ్రెంచి ప్రభుత్వం గుర్తించి, అక్కడి అంధ విద్యార్థులకు దానిని అందుబాటులోకి తెచ్చింది. 1982లో ఎలక్ట్రానిక్ బ్రెయిలీ డిస్‌ప్లే వచ్చింది. ఆ తదుపరి ఎలక్ట్రానిక్ నోట్స్, డిజిటల్ ఆడియో బుక్స్, కంప్యూటర్ స్క్రీన్ రీడర్స్, వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి.
ఫ్రాన్స్ చరిత్రలో మహనీయులుగా గుర్తింపు పొందిన వారి స్మతి నిమిత్తం నిర్మించిన పాంథియన్ మ్యూజియంలో లూయీ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఆయన జన్మించిన ఇంటిని ప్రభుత్వం స్మారకంగా మార్చింది. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఆయన పేరున ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయగా, మనదేశం బ్రెయిలీ పేరిట 2 రూపాయల నాణెం విడుదల చేసింది.
ఆత్మస్థైర్యంతో నిండిన జీవితం
లూయిస్ బ్రెయిల్ జీవిత కథ అంధుల కోసం మాత్రమే కాదు, సాధారణ వ్యక్తులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది. కష్టాలను అధిగమించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం అంటే ఏమిటో ఆయన తన జీవితంతో నిరూపించారు. ఆయన బ్రెయిలీ ఆవిష్కరణతో కోట్లాది మంది అంధులు విద్య, విజ్ఞానం, ఆత్మస్థైర్యాన్ని పొందారు. అంధుల కోసం ఆయన చేసిన సేవలు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆవిష్కరించిన బ్రెయిల్ లిపి అంధుల జీవితాలను మరింత గొప్పగా తీర్చిదిద్దిన అద్భుతమైన వారసత్వం.
డా.అట్ల శ్రీనివాస్ రెడ్డి
9703935321