ఓయూ ఆర్ట్స్‌ కళాశాలకు లైట్‌ షో

ఓయూ నిధులతో ఆర్ట్స్‌ కళాశాల రూఫ్‌ మరమ్మతులు
ఆర్ట్స్‌ కళాశాల కొన్ని సంవత్సరాలుగా వర్షాలకు కురుస్తోంది. దాంతో సుమారు రూ.3 కోట్ల ఓయూ నిధులతో ఆర్ట్స్‌ కళాశాల భవన రూఫ్‌ మరమ్మతులు త్వరలోనే చేపట్టనున్నారు. రూఫ్‌ తరువాత కింద కూడా మరమ్మతులు చేయనున్నారు.
యూనివర్సిటీ చరిత్రను, ప్రాశస్త్యాన్ని తెలిపేలా సౌండ్‌ షో
– కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిధులతో పనులు
– ఇక విద్యుత్‌ దీపాలతో నూతన శోభ
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలు సరికొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆయా కట్టడాల ప్రాశస్త్యాన్ని వివరించేలా సౌండ్‌ షో, ఏడాది పొడవునా లైట్‌ షో ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో గోల్కొండ కోట, చార్మినార్‌, వరంగల్‌ కోట, రామప్ప, భద్రాచలం ఆలయంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల కూడా ఉన్నది. భద్రాచలం ఆలయం సమీపంలోని పర్ణశాలలో మౌలిక సదుపాయాల్ని కల్పించేందుకు కేంద్ర పర్యాటక శాఖ రూ.42 కోట్లు మంజూరు చేసింది. ఆ పనులకు ఇటీవల భూమిపూజ జరిగింది. ఇక్కడ రామాయణ ఇతివృత్తాన్ని కండ్లకు కట్టేలా త్రీడీ పద్ధతిలో ప్రదర్శించనున్నారు.
పర్యాటకుల్ని ఆకర్షించడమే..
ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాల మళ్లీ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రూ.12 కోట్లతో అదనపు హంగులు కల్పించనున్నారు. రెండు నెలల నుంచి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జులై తొలి వారంలో లైటింగ్‌ ప్రారంభించనున్నారని తెలిసింది. రానున్న రెండు, నెలల్లో సౌండ్‌ షో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆర్ట్స్‌ కళాశాలలో లైట్‌ షో కోసం పలుమార్లు ట్రయల్స్‌ నిర్వహించారు. విశ్వవిద్యాలయ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, సమరయోధులు వంటి అంశాలతో సౌండ్‌ షో ఉంటుందని సమాచారం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆర్ట్స్‌ కళాశాల 104 ఏండ్ల చరిత్రను ఇక్కడకు వచ్చే పర్యాటకులకు, విద్యార్థులకు, డెలిగేట్స్‌కు, ఉద్యోగులకు కండ్లకు కట్టినట్టు త్రీడి పద్ధతిలో ప్రదర్శన నిర్వహించనున్నారు. ప్రదర్శనలో ఉండాల్సిన అంశాలపై ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశారు. లైట్‌ షోతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ద్వారా ఓయూ చరిత్రను వివరించేలా ఈ ప్రదర్శన ఉండనున్నది.
కళాశాలల ఎదుట ‘ఫౌన్‌టైన్‌’ను కూడా సుందరంగా అలంకరించి విద్యుత్‌ లైట్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రతి వారంతంలో ఆర్ట్స్‌ కళాశాల మరింతగా విద్యుత్‌ కాంతులతో విరాజిల్లనుంది.
పరిసరాలను సుందరంగా చేయాలి
ఆర్ట్స్‌ కళాశాలకు కుడి, ఎడమ వైపు భాగాల్లో ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఇక్కడ గార్డెనింగ్‌ కళాత్మకంగా.. పచ్చదనం మరింత పెంపొందించేలా యూనివర్సిటీ అధికారులు చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల వెనుక భాగంలో రాత్రి పూట అసాంఘిక కార్యకలాపాల నివారణకు లైట్స్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Spread the love