నవతెలంగాణ – హైదరాబాద్: అయోధ్య రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుందరంగా ముస్తాబు చేసింది. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలతో కూడిన లైట్లను ఏర్పాటు చేసింది. వాటిలో 3,800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దుండగులు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.50లక్షల వరకు ఉంటుందని అంచనా. ఆలయ ట్రస్టు పోలీసులకు ఈ నెల 9న ఫిర్యాదు చేయగా, తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అయోధ్యలోని రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ శేఖర్ శర్మ ఫిర్యాదు చేశారు. రామ్‌పథ్‌లోని చెట్లపై అమర్చిన 3,800 వెదురు లైట్లు, భక్తి పథంలో 36 గోబో ప్రొజెక్టర్ లైట్లు చోరకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఇచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలు లైట్లను ఏర్పాటు చేశాయి. ఎఫ్‌ఐఆర్ ప్రకారం రామ్‌పథ్‌లో 6,400 వెదురు లైట్లు, భక్తి పథంలో 96 గోబో ప్రొజెక్టర్ లైట్లను సంస్థలు ఏర్పాటు చేశాయి. “మార్చి 19 వరకు అన్ని లైట్లు ఉన్నాయి. కానీ మే 9 న తనిఖీ తర్వాత కొన్ని లైట్లు కనిపించలేదు. ఇప్పటి వరకు 3,800 వెదురు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లను ఎవరో గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు” అని శేఖర్ శర్మ తెలిపారు.