నవ్వునెత్తుకొని
కనిపిస్తాం కానీ
లోలోపల పగిలిపోయిన నదులు
చాలా ఉంటాయి.
వొదులు వొదులు బట్టలతో
బయటపడుతాం కానీ
లోపల బిగుసుగా
బరువుగా ముడేసుకొనే జీవిస్తాం.
కుండలు మోయాలి
జొన్నలు మోయాలి
మందు బస్తలు
నారు కట్టలు
నాలుగు గుండెల్ని
నలభై దుఃఖపు కుండల్ని మోయాలి
ఒళ్ళు వూనమైనా
బతుకు
తాకుడు రాళ్ళ గాయాలైనా
సన్నని చీకటిలో
ఊపిరి దారి వెతకాలి.
వెనకొక ఆశ చిగురిస్తూ
ముందొక చీరికల భూమి కనిపిస్తూ
బురదలో నడుస్తూన్నట్లు
జీవితాన్ని వ్యవసాయం చేసే
రైతులు భలే ఉంటారయ్య!.
ఈ బరువైన గాలి
తేలికెలా అవ్వాలి
చినుకుపిట్టలు
నా గుండెపొలం మడిలో
రేపు వాలుతాయి కదా?.
– పేర్ల రాము