నవతెలంగాణ-హైదరాబాద్ : ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న ఇల్లు జప్తుకు సంబంధించి లింగమనేని రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లు జప్తుపై ఏసీబీ కోర్టు తమ వాదనలు వినలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. లింగమనేని రమేశ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటి జప్తునకు అనుమతి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణాధికారి ఏఎస్పీ కోర్టుకు పూర్తి వివరాలతో డాక్యుమెంట్లు సమర్పించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 28న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు తెలిపింది. మరోవైపు ఉత్తర్వులకు ముందు లింగమనేని హైకోర్టును ఆశ్రయించారు.