– రెచ్చిపోతున్న పాట్నా, నలంద గ్యాంగులు
– క్లయింట్లను మాట్లాడటం నుంచి పరీక్షా కేంద్రాలకు చేర్చే వరకూ.. ప్రతీదీ అత్యంత రహస్యంగానే..
– అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు
– ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సీబీఐ
– సంజీవ్ ముఖియా పాత్రను బయటకు తెచ్చిన దర్యాప్తు అధికారులు
నీట్-యూజీ 2024 పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. లీక్ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు నమోదయ్యాయి. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతున్నది. కేంద్రం, నీట్‌ను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ), ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలు విచారణలో భాగంగా తమ వాదనలను వినిపిస్తున్నాయి. అయితే, గురువారం జరిగిన విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: లీక్‌లకు సంబంధించిన లింకులు బీహార్‌లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి పలు అరెస్టులు నమోదయ్యాయి. అనుమానితులను సీబీఐ విచారిస్తున్నది. ముఖ్యంగా, ఆ రాష్ట్ర రాజధాని పాట్నా, నలందల నుంచి గ్యాంగ్‌లు పేపర్ లీక్‌లలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని పలు దర్యాప్తులు చెప్తున్నాయి. బీహార్ పోలీసు వర్గాలు, ఆర్థిక నేరాల విభాగం (ఈఓయూ) దర్యాప్తునకు సంబంధించిన సమాచారం ప్రకారం.. ఇప్పుడు రాష్ట్రంలో రాకెట్‌కు కింగ్‌పిన్, ప్రభుత్వ ఉద్యోగి సంజీవ్ ముఖియా నాయకత్వం వహించారనీ, ఆయన సొంత జిల్లా నలంద కేంద్రంగా ఉన్నదని సూచిస్తున్నాయి. పేపర్‌లను లీక్ చేయటం, వాటిని సర్క్యులేట్ చేయటం నుంచి అభ్యర్థులను చేరుకోవటం, డబ్బును రూట్ చేయటం, వేదికలు, వాహనాలు వంటి లాజిస్టిక్‌లను ఏర్పాటు చేయటం వంటి వివిధ విధులకు వివిధ సభ్యుల బాధ్యతతో ఇది బహుళస్థాయి ఆపరేషన్‌గా అనుమానించబడింది. ఈ కేసును తొలుత ఈఓయూకు, మిగతాది సీబీఐకి అప్పగించిన తర్వాత 18 మందితో సహా బీహార్‌లో అరెస్టుల సంఖ్య కనీసం 25కి పెరగటం గమనార్హం.
లీక్ ఇస్తామంటూ దందా..
సికిందర్ యాదవెందు.. నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేస్తానని నలుగురు అభ్యర్థుల నుంచి డబ్బులు కూడగట్టాడని ఆరోపణ ఉన్నది. వారిలో ఒకరు ఆయన మేనల్లుడు అనురాగ్ యాదవ్(21). సమస్తిపూర్‌కు చెందిన అనురాగ్ 2022, 2023లో నీట్ పరీక్షకు హాజరై సఫలం కాలేకపోయాడు. యాదవెందు అభ్యర్థుల్లో మరొకరు రాంచీకి చెందిన అభిషేక్ కుమార్(21). ఆయన కూడా 2022, 2023లో నీట్‌కు హాజరై విజయం సాధించలేదు. అభిషేక్ తండ్రి అవధేష్ కుమార్. యాదవెందుకి రాంచీలో కాంట్రాక్టర్‌గా ఉన్న రోజుల నుంచి పాత పరిచయం. రాంచీలో నివసిస్తున్న సమయంలోనే అభిషేక్ తన పరీక్షకు పాట్నాను కేంద్రంగా ఎంచుకున్నాడు. అయితే, దీనిని పేపర్ లీక్‌కు సంబంధించిన ప్రణాళికకు సూచనగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అభిషేక్ నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా ఏర్పాటు చేస్తానని 2023లో యాదవెందు తనకు ఆఫర్ ఇచ్చాడని అవధేష్ దర్యాప్తు అధికారులకు చెప్పాడు. ఇందుకోసం యాదవెందు ఇతరుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉండగా, అభిషేక్ కేసులో ఆయన కేవలం రూ. 30 లక్షలతో సరిపెట్టుకున్నాడు. నీట్ వ్యవహారం 2023లో కాకపోతే ఈ ఏడాది పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన యాదవెందుకు.. అవధేష్ రెండు ఖాళీ ఎస్‌బీఐ చెక్కులను ఇచ్చాడు. ఈ ఏడాది మే 3న అభిషేక్‌తో కలిసి అవధేష్ పాట్నాకు వచ్చి యాదవెందులకు అప్పగించాడు.
యాదవెందు మూడో క్లయింట్ ఆయుష్ కుమార్(19). ఈయన దానాపూర్ నివాసి. ఆయుష్ కూడా 2023లో నీట్ పరీక్షలో విఫలమయ్యాడు. గోకుల్ బ్రిక్స్ అనే ఇటుక బట్టీని నడుపుతున్న ఆయుష్ తండ్రి అఖిలేష్ కుమార్.. తాను మ్యాప్ అప్రూవల్ కోసం దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌కు వెళ్లాననీ, అక్కడ యాదవెందును కలిశానని ఈఓయూకు చెప్పాడు. అయితే, 40 లక్షలకు డీల్ జరిగిందనీ, అఖిలేశ్.. యాదవెందులకు ఐడీబీఐ బ్యాంక్ బ్లాంక్ చెక్ ఇచ్చారని దర్యాప్తు అధికారులు వివరించారు. నాలుగో క్లయింట్ బీహార్‌లోని గయాకు చెందిన శివానందన్ కుమార్(18). ఆయన తండ్రి రామస్వరూప్ యాదవ్.. యాదవెందుకు సుపరిచితుడు.
ఈ పేపర్ లీక్ చైన్‌లో మరొక కీలక వ్యక్తి పేరు.. అమిత్ ఆనంద్(29). బీటెక్ చదివిన ఈయన.. పేపర్ లీక్ అయిన సమయంలో ఆనంద్ ”జాబ్ కన్సల్టెన్సీ” నడుపుతున్నాడు. ఆయనకు 2022లో యాదవెందు కార్యాలయాన్ని సందర్శించినప్పుడు వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆనంద్‌కు సంజీవ్ ముఖియా గ్యాంగ్ (తర్వాత మరింత)తో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కానీ నేర చరిత్ర లేదు.
మే 4 సాయంత్రం, యాదవెందు తన నలుగురు క్లయింట్లను ఆనంద్‌కు అప్పగించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇది తర్వాత దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ రాకెట్ సహాయంతో పాట్నాలో నీట్‌ను క్లియర్ చేసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 15. మొత్తం దాదాపు 100 మంది అనుమానాస్పదంగా ఉన్నారు. ఈ 15 మందిలో నలుగురిని యాదవెందు, ఆరుగురిని నితీష్, నలుగురిని ఆనంద్, ఒకరిని రోషన్, అశుతోష్ తీసుకొచ్చాడు.
లీక్ గ్యాంగ్..
పేపర్ లీక్ గ్యాంగ్.. తమ నీట్ అభ్యర్థులందరినీ మే 4 రాత్రి ఖేమ్నిచక్ ప్రాంతంలోని రామకృష్ణ నగర్‌లో గల పాట్నాలోని లెర్న్ బార్సు స్కూల్‌కు తీసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. నగరంలోని ఖేమ్నిచక్ ప్రాంతంలోని ఈ పాఠశాలను కనిపెట్టటం చాలా కష్టం. పేపర్-లీక్ దర్యాప్తుతో సంబంధం ఉన్న ఒక అధికారి ఈ పాఠశాలలో అభ్యర్థులను ఉంచటం.. ముఠా కార్యకలాపాల గురించి ఎవరికీ క్లూ లభించకుండా చూసుకోవటమేనని దర్యాప్తు అధికారులు వివరించారు. పోలీసులు వచ్చిన తర్వాతే భవనంలో జరుగుతున్న విషయాలు తమకు తెలిసిపోయాయని స్థానికులు కొందరు తెలపటం గమనార్హం. ఈ ముఠా అశుతోష్ ద్వారా పాఠశాలను భారీ మొత్తానికి బుక్ చేసిందని ఆరోపించారు.
మే 4న రాత్రి అభ్యర్థులను వేర్వేరు వాహనాల్లో పాఠశాలకు తీసుకెళ్లారనీ, ఆ సమయంలో చింటూ కుమార్ అలియాస్ బల్దేవ్ కుమార్, పింటూ కుమార్, నితీష్ కుమార్ ఉన్నారని సమాచారం. నీట్ పేపర్‌కు సంబంధించిన సమాధానాలు మే 5న ఉదయం 9 గంటలకు చింటూ ఫోన్‌కు రావటంతో అభ్యర్థులకు కంఠస్థం చేసుకోవటానికి ఇచ్చారు.
యాదవెందు తదితరుల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు మే 5న లెర్న్ బార్సు స్కూల్‌కు చేరుకోగా.. అక్కడ సగం కాలిపోయిన పేపర్లు కనిపించాయి. అందులో పేపర్ బుక్‌లెట్ నంబర్ 6136488 ఉన్నది. ఈ బుక్‌లెట్ నంబర్ ద్వారానే పేపర్ లీకైన హజారీబాగ్ కనెక్షన్ గురించి ఈఓయూకి తెలిసింది. బుక్‌లెట్ నంబర్ 6136488 హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్‌లో ఒక బాలికకు కేటాయించబడటం గమనార్హం. కాగా, ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రభాత్ ఖబర్ వార్తాపత్రిక స్థానిక కార్యాలయంలో ప్రకటనల పనిని చూస్తున్న జమాలుద్దీన్‌ను కూడా అరెస్టు చేసింది. బీహార్‌లో పేపర్ లీకైనప్పుడల్లా పేపర్ లీకేజీలకు నలందలో మూలాలుంటాయనీ, దీనితో దర్యాప్తు బృందం చురుగ్గా వ్యవహరిస్తుందని ఈఓయూ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘రంజిత్ డాన్ కోటా’ ఎలా ఉన్నదో అలాగే బీహార్‌లో ఇప్పుడు ‘సంజీవ్ ముఖియా కోటా’ ఉన్నదని సదరు అధికారి చెప్పటం గమనార్హం. గతంలో పేపర్ లీక్‌లలో రంజిత్ డాన్ పేరు ముఖ్యంగా వినబడేది.
ఈ దర్యాప్తులో బీహార్ పోలీసులు, ఈఓయూ తీవ్రంగా శ్రమించి కీలక విషయాలు రాబట్టాయనీ, అయితే తదుపరి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇందులో మరిన్ని విషయాలను వెలికి తీసి, నష్టపోయిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని సామాజిక, విద్యావేత్తలు సూచిస్తున్నారు.
పాట్నా పోలీసులు ఐబీకి ఏం చెప్పారంటే..
నీట్-యూజీ పరీక్ష జరిగే రోజు ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖండ్‌లో ఒక కార్ ఛేజింగ్ జరిగింది. మే 5న నీట్ పరీక్ష మధ్యలో పేపర్‌ను లీక్ చేసిన ముఠా గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) పాట్నా పోలీసులకు చెప్పినట్టు సమాచారం. జార్ఖండ్ నంబర్ ప్లేట్‌తో కూడిన తెల్లటి రెనాల్ట్ డస్టర్‌ను ఇందు కోసం ఉపయోగిస్తున్నట్టు వివరించింది. దీంతో పాట్నా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బైలీ రోడ్డులోని రాజవంశీ నగర్ మలుపు వైపు గస్తీ తిరుగుతున్న శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అమర్ కుమార్ సదరు వాహనం రావటం చూశాడు. దాఖలైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారు పోలీసులను చూడగానే పారిపోయారు. ఈ ముగ్గురే సికందర్ యాదవెందు, అఖిలేష్ కుమార్, బిట్టు కుమార్(డ్రైవర్). అనంతరం, ఇతర పోలీసుల సహాయంతో వీరిని పట్టుకున్నారు. కారులో నలుగురు నీట్ అభ్యర్థుల అడ్మిట్ కార్డుల ఫొటో కాపీలు లభించినట్టు తెలుస్తున్నది. పోలీసులు ఈ నలుగురిని విచారించడం ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యుల్లో కొందరిని కూడా అరెస్టు చేశారు. ఆ కాసేపట్లోనే పేపర్ లీక్ ముఠా రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం మొదలయ్యాయి.