– ఖజానాకు రూ.2,500కోట్ల ఆదాయం
– అత్యధికంగా శంషాబాద్, సరూర్‌నగర్‌లో 8వేలకుపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం నాటికి 50వేల దరఖాస్తులు వస్తే శుక్రవారం చివరి తేది కావడంతో ఒక్క రోజే 75వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 79వేలు మాత్రమే వచ్చాయి.గడువు ముగియనుండడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద బారులు తీరారు. అత్యధికంగా శంషాబాద్, సరూర్‌నగర్‌లో 8వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
రూ.2,500కోట్ల ఆదాయం
ఎక్సైజ్ శాఖకు 1.25లక్షల దరఖాస్తుల ద్వారానే రూ.2,500కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముందని, దీంతో ఆదాయం సైతం పెరగనుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఓ దరఖాస్తుదారుడు తన అనుచురులతో కలిసి 999 దరఖాస్తులు దాఖలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ వ్యక్తి ద్వారానే రూ.19.98కోట్ల ఆదాయం వచ్చింది.పాత విధానం ద్వారా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్‌శాఖ జారీ చేయనున్నది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించగా, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో ఐదుశాతం రిజర్వేషన్లు కల్పించింది. రాష్టవ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనుండగా మిగతా 1,864 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు.