సాహిత్య సునామి నామని

పుట్టింది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. కృషి, పట్టుదల, కుటుంబ ప్రోత్సాహం డిగ్రీలు అందుకునేలా చేశాయి. చదువు పట్ల ఉన్న ఆసక్తి సాహిత్య లోకంలోకి పరుగులు పెట్టించి. కవిత, కథ, నవల ఏదైనా నిజ జీవితాలకి దగ్గరగా ఉండాలనే ఆమె తపన ఈరోజు ఆమెను మంచి కవయిత్రిగా నిల బెట్టాయి. లెక్కకు మించి పురస్కారాలు తెచ్చిపెట్టాయి. ఆమే నామని సుజనాదేవి. ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…

కుటుంబ సహకారంతో…
‘పాదాలకు తడి అంటకుండా సముద్రాన్ని దాటవచ్చు నేమోగాని, కంట నీరు ఒలకకుండా ఏ విజయమూ సాధించలేం’ అన్నది జగమెరిగిన సత్యం. అలా నేను కూడా ఉద్యోగిగా, రచయిత్రిగా, గృహిణిగా పని ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నాను. అయితే కుటుంబం సహకారంతో అన్నింటినీ సమన్వయం చేసుకోగలుగుతున్నాను. అందులో నా భర్త సహకారం ఎప్పుడూ ఉంటుంది. అలాగే మా పిల్లలు కూడా నన్నెంతో అర్థం చేసుకుంటారు. ఏ సమయంలోనైనా నా కథలు, కవితలు టైప్‌ చేయడంలో, పోటీలకు పంపడంలో నాకు సహకరిస్తారు. వాళ్ళెంత బిజీగా ఉన్నా నా పనికి ప్రాధాన్యం ఇస్తారు. సాంకేతికంగా పిల్లలు చాలా సహాయపడతారు. అంతే కాక మా అక్కా, చెల్లెళ్ళ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. మరీ ముఖ్యంగా మా చిన్నక్క కుటుంబ సహకారం మరువలేనిది.
7మాది చేనేత కుటుంబం. మేము ఐదుగురం ఆడపిల్లలం. చేనేతతో కుటుంబం పోషించడం కష్టం కావడంతో నాన్న ఆయుర్వేదిక వైద్యం నేర్చుకుని ఆర్‌ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్‌ పెట్టారు. నా బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది. వరంగల్‌ జిల్లా, మట్టెవాడలో పెరిగాను. పదవ తరగతి స్కూల్‌ ఫస్ట్‌ రావడంతో చదువు పట్ల నాకున్న ఆసక్తి చూసి హన్మకొండ మహిళా కాలేజీలో చేర్పించారు. నిజానికి మా అందరినీ పది పూర్తికాగానే కుట్టు నేర్పించే సెంటర్లో చేర్పించారు. మా అక్కలెవరూ పై చదువులు చదవలేదు. నేను మూడోదాన్ని. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు కవల పిల్లలు. ఒకరికి సంబంధం కుదరగానే ఆ ఇద్దరికీ చూసి చేసేసారు.
పెండ్లి అవుతుందా అన్నారు
    నేను అప్పటికే కాలేజీలో చేరడంతో నన్ను డాక్టర్‌ చేయాలనుకున్నాడు నాన్న. నేను చదివిన స్కూల్లో అప్పుడు కాంపోజిట్‌ మాథ్స్‌ లేకపోవడంతో జనరల్‌ మాథ్స్‌తో చదివించారు. కానీ ఎంసెట్‌ రాయాడానికి వెళ్ళిన ఏడాది అందులో కాంపోజిట్‌ మాథ్స్‌తో కలిసిన పేపర్‌ కంబైండ్‌గా ఇంజనీరింగ్‌ వారికి, మాకు కలిపి పెట్టడం వల్ల సీట్‌ రాలేదు. చాలా బాధ పడ్డాను. మరో పక్క ‘మూడో అమ్మాయిని వదిలి ఆమెకంటే చిన్న వాళ్ళకు పెండ్లి చేశారు. ”ఈ అమ్మాయికి ఇక పెండ్లి అవుతుందా..?” అని కొందరు నాన్నతో అనేవారు. దానికి ఆయన ‘అలాంటి వారికి నా బిడ్డను ఇవ్వను’ అని చెప్పేవారు. ఈరోజు ఇలా చదువులతో అందరి ముందు నిలబడ్డానంటే మా అమ్మ, నాన్న ప్రోత్సాహమే కారణం.
టీచర్‌ ఉద్యోగం వదిలి…
    డిగ్రీ అయిపోగానే బి.ఈడీ సీట్‌ హన్మకొండలోనే వచ్చింది. బి.ఈడీ పరీక్షలు మొదలైన రోజు రాత్రి నా పెండ్లి. అలాగే పరీక్షలన్నీ పూర్తి చేసి యూనివర్సిటీలో ఏడవ ర్యాంక్‌ సాధించాను. వెంటనే గవర్నమెంట్‌ స్కూల్లో టీచర్‌గా సంగెం మండలంలో ఏడాది చేశాను. నా భర్త క్యాతమ్‌ సంపత్‌కు జీవిత బీమా సంస్థలో ఉద్యోగం. ఇద్దరం ఒకే సంస్థలో ఉంటే మంచిదని ఇందులో పరీక్షలు రాస్తే అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. తర్వాత మా అత్తమ్మ, మామయ్యా, భర్త సహకారంతో ఎమ్మెలో తెలుగు, ఇంగ్లీష్‌, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎల్‌ఎల్‌బీ, పీజీడీసీఏ చేసి డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో కూడా చివరి పరీక్ష ఫెలోషిప్‌ ఇన్‌ ఇండియన్‌ ఇన్సూరెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ పట్టా అందుకున్నాను. వీటితో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రెండు డిప్లొమాలు చేసాను.
సాహిత్యంతో పరిచయం...
    మా నాన్న దవాఖానా కోసం వివిధ పత్రికలు తెప్పించేవారు. దాంతో చదవడం అనే అలవాటు తర్వాత వ్యసనంగా మారింది. ఆఫీస్‌లో కూడా క్లబ్‌ తరఫున పత్రికలు తెప్పించేవారు. అవి చదివేటపుడు నాకూ రాయాలనే కోరిక వచ్చింది. మొట్ట మొదటిసారి ఓ పత్రికకు కొత్త రచయితలు అనే శీర్షిక కోసం కథ రాసాను. అది 1991లో అచ్చయింది. ఆ కథకు స్పందనగా చాలా ఉత్తరాలు వచ్చాయి. అవి చాలా ప్రోత్సాహం ఇచ్చాయి. విదేశాల నుండి మెయిల్‌ ద్వారా కూడా స్పందనలు రావడం ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అలా మొదలైన నా సాహితీ ప్రస్తానం కొనసాగుతూనే ఉంది.
పురస్కారాల జల్లు
    ఇప్పటి వరకు ఐదు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలు వెలువరించాను. దాదాపు ఒక్క కవితా సంపుటికి తప్ప అన్నింటికీ పురస్కారాలు వచ్చాయి. ఒక్క ‘స్పందించే హృదయం’ కథా సంపుటికి ఇప్పటికి ఏడు జాతీయ పురస్కారాలు వచ్చాయి. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలంగాణా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లలో కూడా చోటు దక్కింది. మల్టీ టాలెంట్‌ ఉమెన్‌గా తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారి నుండి పురస్కారం అందుకున్నాను.
నామని నవలలు
    నాలుగు నవలలురాస్తే నాలుగింటికి బహుమతులు వచ్చాయి. మొట్టమొదటి నవల ”ఐ లవ్‌ ఇండియా”కు ప్రతిష్టాత్మక అంపశయ్య నవీన్‌ పురస్కారం అందుకున్నాను. తర్వాత ‘కొత్త పాఠం’ నవలకు సాహో మాస పత్రిక ద్వారా పదివేల నగదు బహుమతి, ‘ముగ్గురమ్మాయిల సవాల్‌’ నవలకు తపస్వి మనోహరం పత్రిక వారు బహుమతి ఇచ్చి వారే ప్రింట్‌ కూడా చేసి ఇచ్చారు. ‘ఇంటింటి రామాయణం’ నవల మామ్స్‌ ప్రేస్సో వెబ్‌ సైట్‌లో బహుమతి పొందింది. ఇప్పటికి వెబ్‌ సైట్‌లలో, వివిధ పత్రికలలో కలిపి దాదాపు మూడు వందలకు పైగా కథలు ప్రచురించ బడ్డాయి. దాదాపు యాభైకి పైగా కథలకు, కవితలకు బహుమతులు వచ్చాయి. తానాతో సహా ప్రముఖ సంస్థల నుండి యాభైకి పైగా పురస్కారాలు వచ్చాయి.
అలసట మర్చిపోతాను
    ప్రస్తుతం నా రచనలపై కాకతీయ తెలుగు విశ్వ విద్యాలయంలో ఓ విద్యార్ధి పీహెచ్‌డీ చేస్తున్నారు. చాలామంది నా కథలు చదివి ‘మీరు రాసిన కథ చదువుతుంటే నా కథలాగే ఉంది’, ‘మీ కథ చూసి మా ఆలోచన మార్చుకున్నాం’ అంటూ అప్పుడప్పుడు ఫోన్లు చేసి చెబుతుంటారు. దాంతో నా అలసట మొత్తం ఇట్టే ఎగిరిపోతుంది. ఓ రచయిత్రిగా ఇంతకంటే ఏం కావాలి.
– సలీమ

Spread the love