– వృద్ధులు, పేదలపై కనికరం చూపని మోడీ ప్రభుత్వం
– 2011 నుంచి ఎదుగూ బొదుగూ లేని పెన్షన్ బడ్జెట్
– సవాలక్ష నిబంధనలతో దూరమవుతున్న లబ్దిదారులు
– ధరలు ఆకాశాన్ని తాకుతున్నా నామమాత్రపు పింఛనే దిక్కు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు భారతావని సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో వృద్ధుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం ఏం చేసింది? పేదలు, వితంతువులు, దివ్యాంగుల జీవితాలు ఎలా ఉన్నాయి? సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదం ఏ మేరకు ఫలితాన్ని ఇచ్చింది? వృద్ధులకు కల్పించిన రాయితీలను కోవిడ్ అనంతరం రైల్వే శాఖ ఎందుకు పునరుద్ధరించలేదు? వంటి ప్రశ్నలకు ఈ సందర్భంగా సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ) కింద వృద్ధులకు అందజేస్తున్న పెన్షన్ సొమ్ము 2011 నుంచి ఎదుగూ బొదుగూ లేకుండా స్థిరంగా ఉంది. అందులో ఏ మాత్రం పెరుగుదల కన్పించడం లేదు. మోడీ పాలనలో గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి ప్రతి బడ్జెట్లోనూ రూ.9,500 కోట్లు మాత్రమే కేటాయిస్తూ వచ్చారు. బడ్జెట్ మొత్తం పెరుగుతున్నప్పటికీ ఈ పద్దుకు మాత్రం కేటాయింపులు అలాగే ఉంటున్నాయి. ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన తర్వాత కూడా బాండ్ల ముద్రణ కోసం మోడీ ప్రభుత్వం అక్షరాలా రూ.10,000 కోట్లు ఖర్చు చేసి బూడిదలో పోసింది. కానీ వృద్ధులకు అందించే పెన్షన్ సొమ్మును మాత్రం పెంచలేదు.
నామమాత్రపు పెన్షన్‌తో సరి
2014-2015 బడ్జెట్లో ఎన్ఎస్ఏపీ కేటాయించింది 0.58%. ఇది ప్రస్తుత బడ్జెట్ లో 0.2 శాతానికి పడిపోయింది. మరోవైపు పన్నులు ఎగవేసిన బడా కార్పొరేట్ సంస్థలకు రూ.2.84 లక్షల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనాలు కల్పించారు. వితంతువులు, దివ్యాంగులకు గతంలో రూ.200 నెలసరి పెన్షన్ ఇచ్చే వారు. దానిని 2012లో రూ.300కు పెంచారు. నిత్యావసరాలైన పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ముష్టివాడికి విదిల్చినట్లు నామమాత్రంగా పెన్షన్ అందిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది.
కఠిన నిబంధనలతో…
పోనీ ఎన్ఎస్ఏపీలో అర్హులందరికీ స్థానం కల్పించారా అంటే అదీ లేదు. అర్హతలకు సంబంధించి కఠినమైన నిబంధనలు విధించడంతో పెద్ద సంఖ్యలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అర్హతలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నడో కాలం చెల్లిన 2011 నాటి సమాచారంపై ఆధారపడుతోంది. మహిళల వయసు 40-60 సంవత్సరాల మధ్య ఉంటేనే ఈ కార్యక్రమం కింద లబ్ది పొందేందుకు అర్హులు. ఇక దివ్యాంగులు 80 శాతానికి పైబడి శారీరక వైకల్యం కలిగి ఉండాలి. దీంతో ఆర్థిక సాయం అవసరమైన కోట్లాది మందికి అది అందకుండా పోతోంది. దేశంలో 78 శాతం మంది వృద్ధులకు పెన్షన్ లభించడం లేదని నిటి అయోగ్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. వీరిలో సుమారు 70 శాతం మంది తమ నెలవారీ ఖర్చుల కోసం కుటుంబసభ్యులు, బంధువులపై ఆధారపడాల్సి వస్తోంది.
ఏ రంగమైనా అదే పరిస్థితి
ఇక అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి అటల్ పెన్షన్ యోజన వంటి పింఛను పథకాలేవీ అందుబాటులో లేవు. ఎందుకంటే వారు సాధారణ సంక్షేమ పథకాలతో అనుసంధానమై ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల నమోదు కోసం ప్రారంభించిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటి వరకూ కేవలం 29.48 కోట్ల మందే తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం 2019లో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్-ధన్ (పీఎం-ఎస్వైఎం) పేరిట కంట్రిబ్యూటరీ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి 2023-24లో రూ.350 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరపగా ప్రస్తుత బడ్జెట్లో రూ.177 కోట్లు మాత్రమే కేటాయించారు. 2019-2024 మధ్యకాలంలో ఈ పథకంలో కేవలం 50 లక్షల మంది మాత్రమే చేరారు. గత సంవత్సరం జనవరి, జూన్ మధ్య కాలంలో 21 శాతం మంది లబ్దిదారులు ఈ పథకం నుంచి బయటికి వచ్చారు.
తగ్గుతున్న లబ్దిదారులు
దేశంలో ఆరు కోట్ల మంది నిరుపేదలు ఉన్నారని ఇండియా ఏజింగ్ నివేదిక చెబుతోంది. వీరిలో సుమారు కోటి మంది ఎలాంటి ఆదాయం లేకుండా బతుకులు నెట్టుకొస్తున్నారు. అయినప్పటికీ వృద్ధాప్య పథకాల లబ్దిదారుల సంఖ్య తగ్గడం గమనార్హం. 2012లో లబ్దిదారుల సంఖ్య 2.27 కోట్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 2.21 కోట్లకు పడిపోయింది. పేదలకు అందిస్తున్న సాయాలపై మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. భారీ ప్రకటనలు, పోస్టర్లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవడంతో సామాజిక ఆర్థిక సహాయ కార్యక్రమాల కోసం రాష్ట్రాలు కేంద్రం కంటే ఐదు నుండి పది రెట్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
బడా సంస్థలకే రాయితీలు
ప్రతి వృద్ధుడికీ మూడు వేల రూపాయల నెలవారీ పెన్షన్ (మొత్తం ఖర్చు రూ.5.36 లక్షల కోట్లు) ఇస్తే ఖజానాపై పెనుభారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదే ప్రభుత్వం 2014-15, 2022-23 మధ్యకాలంలో బడా కార్పొరేట్ సంస్థలకు సుమారు రూ.15 లక్షల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది.