నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న మాట కులగణన. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే విపక్ష పార్టీలు కూడా కులగణన చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే మనుషులనే కాదు.. పశువులను కూడా లెక్కించేందుకు కేంద్రం సిద్ధపడింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల మాదిరిగానే ఈ పశుగణన చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ పశుగణనను సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మొబైల్ టెక్నాలజీ వినియోగంతో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గురువారం పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక కమిటీ సభ్యులతో మంత్రిత్వ శాఖ సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో 21వ పశుగణనను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.