– బాబు, జగన్ డిష్యూం.. డిష్యూం
– నెయ్యి కొనుగోలులో ఏం జరిగింది?
– ప్రశ్నలు లేవనెత్తుతున్న టెండర్ డాక్యుమెంట్ పత్రాలు
– అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్టకు 300 కేజీల నెయ్యి సరఫరా
– 300 కిలోల లడ్డూలు జగన్ సర్కార్ పంపిణీ
– సుప్రీంకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన కీలకమైన టెండర్ పత్రాలు ‘ఇండియా టుడే’ పత్రిక చేతికి అందాయి. ఈ పత్రాలు నెయ్యి సేకరణ ప్రక్రియపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 2023 ఆగస్ట్, ఈ ఏడాది జూలై మధ్యకాలంలో టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యి పైనే వివాదం నడుస్తోంది. జగన్ పాలన చివరి ఏడాదిపై నన్న మాట! టెండర్ డాక్యుమెంటులోని క్లాజ్ 80 ప్రకారం సరఫరాదారుడు ప్రతి కన్‌సైన్‌మెంటుతో పాటు ఎన్‌ఏబీఎల్ అక్రెడిటేషన్ కలిగిన, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి పొందిన క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను టీటీడీకి అందజేయాల్సి ఉంటుంది. క్లాజ్ 81 ప్రకారం ఆ నెయ్యి నమూనాలను టీటీడీ ల్యాబ్ పరీక్షలకు పంపాలి.
కచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ నెయ్యిని ఎలా కల్తీ చేశారన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నుండి తీసుకున్న నమూనాలలో ఈ కల్తీ ఎందుకు బయటపడలేదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో తిరుమల లడ్డూ పంపిణీ 300 కేజీల నెయ్యి కూడా ఏపీ సర్కార్ సరఫరా చేసింది. నెయ్యి అయితే హోమ గుండంలో వాడి వుండవచ్చు!
ఇక తిరుమల లడ్డూ వ్యవహారమే దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ అంశంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్ర ప్రసాదమైన ఈ లడ్డూను.. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులకు పంపిణీ చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా తెలిపారు.
అయితే, ఎన్ని లడ్డూలు వచ్చాయన్నదానిపై తనకు స్పష్టంగా తెలియదని.. 300 కేజీల వరకూ లడ్డూ ప్రసాదంగా వచ్చినట్టు అంచనా వేశారు. ఆ విషయం ఆలయ ట్రస్ట్‌కు స్పష్టంగా తెలుసని చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన లడ్డూలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పవిత్ర ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం అన్నది క్షమించరాని నేరం అని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైష్ణవులు, కొందరు భక్తులు కనీసం వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా ముట్టరు. అలాంటి పరిస్థితుల్లో నెయ్యిలో కొవ్వు కలిపారనడం నిజంగా దురదష్టకరం. ఇది హిందువుల విశ్వాసాలను ఎగతాళి చేయడమే’ అని అన్నారు. దీంతో పాటు 300 కేజీల నెయ్యి కూడా అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అప్పటి ఏపీ సర్కార్ సరఫరా చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రయివేట్ లిమిటెడ్‌ను దేవాలయం పాలకమండలి బ్లాక్‌లిస్టులో పెట్టిందని, కల్తీ నెయ్యిని సరఫరా చేసినందుకు ఆ కంపెనీపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావు తెలిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఏఆర్ డెయిరీ తోసిపుచ్చింది. ల్యాబ్ నివేదికను సవాలు చేశామని తెలిపింది. పైగా జూన్, జులై నెలల్లో మాత్రమే టీటీడీకి నెయ్యి సరఫరా చేశామని చెప్పింది. తిరుమల దేవాలయానికి ప్రతి రోజూ 10 టన్నుల నెయ్యి అవసరమవుతుందని, అందులో తాము 0.1 శాతం కూడా సరఫరా చేయలేదని వివరణ ఇచ్చింది. ఇది రాజకీయ వివాదంగా మారిందని అంటూ నెయ్యి కన్‌సైన్‌మెంటును అక్రెడిటెడ్ ల్యాబ్ నివేదికతో పాటు పంపామని గుర్తు చేసింది. ‘నివేదికలో మా పేరు లేదు. ల్యాబ్ ఫలితాలు జంతు సంబంధమైన మందులు వంటి ఇతర కారణాలను కూడా ప్రస్తావించాయి’ అని తెలిపింది.
కాగా, ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం లక్ష లడ్డూ ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేసి పంపింది. అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసింది. ప్రధాని మోడీ నేతత్వంలో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీవారి లడ్డూ కల్తీపై నివేదికివ్వండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వ కాలంలో టీటీడీ తయారు చేసిన ప్రసాదం కల్తీ సరుకులతో, జంతు కొవ్వుతో తయారైందని చెప్పడంతో పెద్ద దుమారం చెలరేగింది. కాగా, తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కారును కేంద్ర మంత్రి నడ్డా కోరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని, వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కోరానన్నారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు అవసరమని, దోషులకు తగిన శిక్ష పడాల్సిందేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇది కేవలం కుంభకోణమే కాదని, హిందూయిజం నాశనానికి జరిపిన కుట్రగా ఆయన అభివర్ణించారు.
సుప్రీం కోర్టులో పిటిషన్
తిరుమల కల్తీ నెయ్యి వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల లడ్డూ కల్తీతో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని హిందువుల మతపరమైన హక్కులను కాపాడాలని సత్యం సింగ్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.