టీయూ టిఫిన్‌లో బల్లి

టీయూ టిఫిన్‌లో బల్లి– కేర్‌ టేకర్‌పై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ-డిచ్‌పల్లి
తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లోని టిఫిన్‌లో బల్లి వచ్చింది. ఇది శుక్రవారం జరగ్గా శనివారం వెలుగులోకొచ్చింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల హాస్టల్‌లో అల్పాహారం సమయంలో ఓ విద్యార్థిని ప్లేటులో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో విద్యార్థినులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం బయటకు పొక్కకుండా విద్యార్థినులను యూనివర్సిటీ అధికారులు హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఎస్‌ఎఫ్‌ఐతో పాటు పలు విద్యార్థి సంఘాల దృష్టికి రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ వసతి గృహాల్లో విద్యార్థులకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని పలుమార్లు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ బల్లి పడిన ఆహారాన్ని తిని ఉంటే విద్యార్థినుల పరిస్థితి నేడు వేరేరకంగా ఉండేదని, ఇది ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. అయితే, బాలికల వసతి గృహం అల్పాహారంలో బల్లి వచ్చిన ఘటనలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. హాస్టల్‌ వంట మనిషి రాజేష్‌ను సస్పెండ్‌ చేశారు.
కేర్‌ టేకర్లను సస్పెండ్‌ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
అల్పాహారంలో శుక్రవారం బల్లి పడితే యూనివర్సిటీ అధికారులు శనివారం వరకు స్పందించరా.. అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు మహేష్‌, విఘ్నేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతవరకు యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ ఛాన్సలర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా టీయూను సందర్శించలేదని, వెంటనే సందర్శించాలన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించని కేర్‌ టేకర్లపై ఇప్పటివరకు రిజిస్ట్రార్‌ యాదగిరి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెంటనే వంట మాస్టర్‌లపై చర్యలు తీసుకొని, విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే యూనివర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

Spread the love