– కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వీరయ్య
నవతెలంగాణ భద్రాచలం రూరల్
రుణమాఫీతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏఐసీసీ మెంబర్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. భద్రాచలంలో శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిందన్నారు. 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం వేసిందని పేర్కొన్నారు. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న రుణాలకు ఇది వర్తిస్తుందన్నారు. 48 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రశంసనీయమన్నారు. ఆగస్టు 15, 2024లోపు రుణమాఫీ పూర్తిచేసేందుకు కసరత్తు జరుగుతోందని వ్యాఖ్యానించారు. మే 6, 2022 నాటి వరంగల్ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం నేడు నిలబడిందన్నారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా రైతు వరి నారు పోయేకముందే మే నెలలో సన్నాళ్లకు రూ.500 బోనస్ ప్రకటించ డంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టే రైతు నారు వేయక ముందే ముందస్తుగా బోనస్ ప్రకటించిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం పక్షాన రాష్ట్ర మంత్రివర్గానికి రైతుల తరఫున, తన తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పొదెం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిమి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ్మల్ల వెంకటేశ్వర్లు, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమాచినేని వినీల్, చిట్టిబాబు, శేషు, తోటముల సుధాకర్, కొలపుడి వరుణ్, కుంచాల రమేష్, శీలం రామ్మోహన్ రెడ్డి, కారుమంచి సతీష్, తదితరులు పాల్గొన్నారు.