లక్షలోపు రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలి

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగా రెడ్డి డిమాండ్‌
నవతెలంగాణ-జనగామ
ముఖ్యమంత్రి కెసిఆర్‌ 2018లో ప్రకటించిన లక్షలోపు రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగా రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రాపర్తి సో మయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగా రెడ్డి మాట్లాడుతూ వానాకాలం సాగు మరో నెల రోజు లలో ప్రారంభం అవుతుందని అన్నారు. కానీ పంట రుణాలు బ్యాంకులు రైతు లకు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్‌ వారిపై ఆధారపడుతున్నారని అన్నారు. బ్యాంకులు కొత్త టెక్నిక్‌ను పాటించి రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చూపుతున్నాయని అన్నారు. పాత రుణాలను తిరిగి కొత్త రుణాలుగా మార్చి బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేస్తున్నారని అన్నారు. కెసిఆర్‌ ప్రకటించిన రుణమాఫీ పథకం అమలు కాకపోవడం వలన రైతులు బాకీలు పడిపోయారని అన్నారు. 2018లో చేసిన రుణమాఫీ ప్రకటన చేసినప్పుడు రూ.21,557 కోట్లు ఉండగా, 2023 ఫిబ్రవరి 14 నాటికి ప్రభుత్వం చెల్లించినది రూ.1,206 కోట్లు మాత్రమేనని అన్నారు. 2020-24 బడ్జెట్‌లలో రూ.6,385 కోట్లు కేటాయింపు చూపారని అన్నారు. ఇంకా రూ.13,966 కోట్లు ప్రభుత్వం చెల్లించాలని గుర్తు చేశారు. 4వ విడత పూర్తిగా మాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అప్పుడే రైతులు రుణ భారం తగ్గుతుందని అన్నారు. రైతులు దాదాపు 20 వేల కోట్లు ప్రైవేట్‌ రుణాలు తెచ్చుకొని వ్యవసాయం చేయడంతో పంటలు దెబ్బతిని రుణ గ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఏటా రాష్ట్రంలో 648 మంది రైతులు సగటున ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయని అన్నారు. మిగిలిన వారికి ఒకే విడతలో రుణమా ఫీ అమలు చేయాలని కోరారు. దీనివల్ల రైతులకు కొత్తగా రుణాలు లభించే అవకాశం ఉంటుందని అన్నారు. అటూ రైతులు చెల్లించకా, ఇటూ ప్రభుత్వం చెల్లించకపోవడంతో బాకీ ఉన్న రైతులకు రుణం ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. వెంటనే రైతులకు పంట రుణాలు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఇవ్వాలని, అర్హత గల వారికి రుణాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదని, బ్యాంకర్లకు ప్రభుత్వం అదేశాలిచ్చి పంట రుణాలు ఇవ్వడానికి వీలుగా ఏఈఓల ద్వారా ఏర్పాటుచేసి చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్‌ జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య సహయ కార్యదర్శి రామావత్‌ మీట్యా నాయక్‌ జిల్లా కమిటీ సభ్యులు పొన్నాల రాజవ్వ బచ్చు శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Spread the love