లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో

Lok Sabha and Assembly seats– ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు పొడిగింపుపై పరిశీలన
– నవంబర్‌ 21 నుంచి విచారించనున్న రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ : లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్‌సిలకు, ఎస్‌టిలకు సీట్లు రిజర్వేషన్‌కు మంజూరు చేసిన క్లాక్‌ వర్క్‌ (సమయానుకూలంగా) పొడిగింపులు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతాయా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నిర్ణయించింది. జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఎంఎం సుంద్రేశ్‌, జస్టిస్‌ జెపి పర్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలు కూడా ఉన్న ధర్మాసనం నవంబర్‌ 21 నుంచి దీనిపై విచారణ చేయనుంది. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి పదేళ్ళ పాటు మాత్రమే ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్‌ వుండాలని అంబేద్కర్‌ నేతృత్వంలోని రాజ్యాంగ నిర్ణయాక అసెంబ్లీ ఉద్దేశించింది.
అయితే, అప్పటి నుండి దశాబ్దాల కాలం పాటూ రాజ్యాంగంలోని 334వ అధికరణను పలుసార్లు సవరిస్తూ వచ్చారు. సవరించిన ప్రతీసారి పదేళ్లు అంతకన్నా ఎక్కువ కాలం పొడిగిస్తూ వచ్చారు. 1969లో రాజ్యాంగం (8వ సవరణ)తో మొదలు పెడితే, 2019లో రాజ్యాంగం (104వ సవరణ) వరకు పదే పదే గడువు పొడిగించబడుతూ వచ్చింది. 2030 కల్లా ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటీలు 80ఏళ్ల నుండి రిజర్వేషన్‌ సదుపాయాన్ని అనుభవించి వుంటాయి.
కేవలం చట్టసభల్లో ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటీలకు రిజర్వేషన్‌ కొనసాగించడం కోసమే 334వ అధికరణను పదే పదే సవరించడానికి రాజ్యాంగ అధికారాన్ని పార్లమెంట్‌ ఉపయోగించుకోవచ్చా లేదా అని పరిశీలించాలని రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది. 2019 సవరణ చట్టంలోని 104వ సవరణను ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటీలకు వర్తింప చేయడం వరకు మాత్రమే దాని చెల్లుబాటును తాము పరిశీలిస్తామని కోర్టు వివరణ ఇచ్చింది. అంతేగానీ 70ఏళ్ళు ఆ ప్రయోజనాన్ని అనుభవించిన మీదట ఆంగ్లో-ఇండియన్‌ కమ్యూనిటీ కోటాను రద్దు చేయడాన్ని పరిశీలించబోమని తెలిపింది.

Spread the love