అమరావతికి లోకాయుక్త, హెచ్‌ఆర్‌సి తరలింపు

అమరావతికి లోకాయుక్త, హెచ్‌ఆర్‌సి తరలింపు– హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
అమరావతి : కర్నూలులోని రాష్ట్ర లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (ఎస్‌హెచ్‌ఆర్‌సి) కార్యాల యాలను అమరావతికి తరలించాలని సూత్ర ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఉత్తర్వులు, ఆపై నోటిఫికేషన్‌ జారీ వెలువరిస్తామని వివరించింది. అయితే, ఆ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రవి చీమలపాటితో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ప్రకటించింది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సిలను కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మద్దిపాటి శైలజ 2021లో దాఖలు చేసిన పిల్‌పై తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో జస్టిస్‌ పేరిట అన్ని కోర్టులు, ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, వీటి విషయంలో చెప్పడం లేదని పిటిషనర్‌ తరపున న్యాయవాది డిఎస్‌ఎన్‌వి ప్రసాద్‌ బాబు చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదిస్తూ, రాజధానిలో ఏర్పాటు చేసే విషయాలపై కౌంటర్‌ వేస్తామని చెప్పారు.

Spread the love