బీఆర్ఎస్ లో‌ లోల్లి.. కీలక నేతలు…

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పంచాది తారస్థాయికి చేరింది. పల్లా వర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి సహా మెజార్టీ లీడర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి సగానిపైగా లీడర్లు హాజరు కాలేదు. 130 మంది నాయకులకు ఆహ్వానం ఉండగా కేవలం 50 నుంచి 55 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ టికెట్ ను వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, గీత కార్మికుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గొర్రెలు & మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ ఆశించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన ఏనుగు రాకేశ్ రెడ్డికి పార్టీ నాయకత్వం కేటాయించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని మఖ్యనేతలే మీటింగ్ కు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వారాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీంద్ రావుతో పాటు పలువురు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ మీటింగ్ కు గైర్హాజరవడం గమనార్హం. పల్లా వర్గానికి చెందిన రాకేశ్ రెడ్డికి మద్దతు ఇచ్చేది లేదని పలువురు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం. ఇవాళ్టి సమావేశానికి కేటీఆర్ ఒత్తిడి మేరకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ హాజరయ్యారు.

Spread the love