వ‌స‌తిపై న‌జ‌ర్

వ‌స‌తిపై న‌జ‌ర్– అక్రమాలకు అడ్డాగా మారుతున్న వసతిగృహాలు
– తాజాగా ఏసీబీ ఆకస్మిక దాడులతో కలకలం
– వేమనపల్లి ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు
– పిల్లల హాజరులో వ్యత్యాసం ఉందని నిర్దారణ
– మిగతా వాటిలోనూ తనిఖీలకు వ్యూహరచన
పేద విద్యార్థులు చదువుకునే వసతిగృహాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిలో సౌకర్యాలపై ఆరా తీసే పనిలో నిమగమైంది. తాజాగా వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) దృష్టి సారించడం సర్వత్రా కలకలం రేపుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా వసతి గృహాల్లో సౌకర్యాలతో పాటు ఏమైనా అక్రమాలు చోటుచేసుకున్నాయనే అనే కోణంలో ఆరా తీయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని వసతిగృహాల్లో ఏకకాలంలో చేసిన ఈ దాడులు ఉమ్మడి జిల్లాలోనూ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ శాఖల బృందంతో వచ్చిన ఏసీబీ అధికారులు మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. వసతిగృహంలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు స్టాక్‌ రిజిస్టర్‌, పరిసరాలు, విద్యార్థుల హాజరు తదితర వాటిని పరిశీలించింది. తాజాగా వేమనపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో విద్యార్థుల హాజరుశాతంలో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని మిగతా వసతిగృహాల్లోనూ ఇదే తరహా దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, వేమనపల్లి
పేద విద్యార్థులు ఉన్నత చదవుల నిమిత్తం ప్రభుత్వం వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఉన్న ప్రాంతంలో ఉన్నత చదువులు చదివేందుకు బడులు, కళాశాలలు లేకపోవడం..మండల, పట్టణ కేంద్రాల్లో మాత్రమే ఉండటంతో అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఉన్న ఊరి నుంచి రోజూ ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించడం కష్టంగా మారుతుండటంతో అనేక మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటూ పాఠశాల, కళాశాల విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ప్రభుత్వం మెస్‌ఛార్జీలతో పాటు కాస్మోటిక్‌ చార్జీలను కూడా చెల్లిస్తోంది. విద్యార్థులకు రోజువారీగా పెట్టే భోజనం కూడా మెనూ ప్రకారం పెట్టాలని సూచించింది. రోజువారీగా కోడిగుడ్లు అందించడంతో పాటు మూడు పూటల భోజనం, పల్లిపట్టీలు, రాగిమార్ట్‌, పాలు, ఉడికించిన శనగలతో పాటు కటింగ్‌ చార్జీలు, బట్టలు, పెట్టె, తదితర వస్తువులు కూడా అందించాల్సి ఉంటుంది. వారంలో రెండు చికెన్‌, మటన్‌ కూడా పెట్టాల్సి ఉంటుంది. కానీ చాలా వసతిగృహాల్లో మెనూ అమలు కావడం లేదని.. అధికారులు సైతం వీటిని పర్యవేక్షించడం లేదని అనేక ఆరోపణలు ఉన్నాయి. గురుకులాలు అధికంగా రావడంతో అందరి దృష్టి వాటిపైనే పడింది. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు సైతం వసతిగృహాలను పర్యవేక్షిస్తున్న సందర్భాలు కనిపించడం లేదనే విమర్శలున్నాయి. కొందరు వసతిగృహ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఏసీబీ తనిఖీలతో కలకలం..!
రాష్ట్రంలోని వసతిగృహాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం వీటిలో అక్రమాలు నిరోధించాలని భావించింది. ముఖ్యంగా చాలా వసతిగృహాల్లో విద్యార్థులు లేకపోయినా ఉన్నట్లు హాజరు పట్టికలో చూపించి ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన ప్రయోజనాలను అధికారులే స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు సౌకర్యాలు కూడా లోపించడం.. శుభ్రత పాటించకపోవడం, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోలేకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో వసతిగృహ అధికారులే అన్ని తామై వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు సానిటరీ, ఫుడ్‌సేఫ్టీ, తూనికలు, కొలతలు, ఆరోగ్యం, ఆడిట్‌ శాఖ అధికారులను వెంట పెట్టుకొని వసతిగృహాలను సందర్శిస్తున్నారు. లోపాలు ఎక్కడ ఉన్నాయో ముందస్తుగానే తెలుసుకొని ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేమనపల్లిలో తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. తాజాగా వారి పరిశీలనలో విద్యార్థుల హాజరులో వ్యత్యాసంతో పాటు పలు లోపాలు ఉన్నట్లు గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా మిగితా చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగితా వసతిగృహాల్లోనూ తనిఖీలు ముమ్మరం కానున్నాయని ప్రచారం జరుగుతోంది.

Spread the love