రిటైర్డ్‌ ఉద్యోగులపై చిన్నచూపు

Adilabad,Telangana News,Telugu News– మ్యూచువల్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ బోర్డ్‌ సొసైటీ సభ్యుల ఆవేదన
నవతెలంగాణ-మంచిర్యాల
మ్యూచువల్‌ కో ఆపరేటివ్‌ హౌసింగ్‌ బోర్డ్‌ సొసైటీ నిర్వహణ సక్రమంగా లేదని, టీఎన్‌జీఓ సభ్యులు పెత్తనం చెలాయిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని రిటైర్డ్‌ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జిల్లాలో పనిచేసిన టీఎన్‌జీఓ ఉద్యోగులకు ప్రభుత్వం నస్పూర్‌ శివారులోని సర్వే నెంబర్‌ 42 లో ఇండ్ల స్థలాల కోసం భూములను కేటాయించినట్లు, ఆ భూముల్లో కోర్టుకేసులు ఉండటంవల్ల ఇన్ని రోజులు కాలయాపన జరిగిందన్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఇండ్లు కట్టుకుందామని అనుకునే సరికి ప్రస్తుత టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అవినీతికి పాల్పడుతూ రిటైర్డ్‌ అయిన ఉద్యోగుల వద్ద నుండి రూ.లక్షలు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వరుస క్రమంలో మాకు రావాల్సిన ప్లాట్లను వేరే వారికి అప్పజెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడని, మా ప్లాట్లు మాకు రావాలంటే శ్రీహరికి లక్షల్లో డబ్బులు ముట్ట జెప్పాలని, ప్రశ్నించిన వారి ప్లాట్లు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు నెంబర్లతో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్లు అప్లై చేస్తున్నప్పటికీ మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తున్నారని, ఇంటి నిర్మాణం చేసే నిర్వాహకుల ఇంటి నెంబర్‌లు ఒక చోట ఉంటె వారు నిర్మాణం ఇంకొక చోట చేస్తున్నారని, దీనివల్ల గతంలో టీఎన్‌జీఓ సంఘంలో పని చేసి రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ తమ సమస్యపై దృష్టి సారించి వారికీ న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షాన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో రిటైర్డ్‌ ఉద్యోగులు ఏ పోచయ్య, నర్సారెడ్డి, దేవపాల, డి రాజయ్య, కుర్షిద్‌ అహ్మద్‌ ఖాన్‌, అఫ్జల్‌ నబి, బషీర్‌ అహ్మద్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Spread the love