కొండంత దోచేస్తూ.. గోరంత ఇస్తూ…

– అన్నదాతలపై మోడీ ప్రభుత్వ కపట ప్రేమ
– ఎంఎస్‌పీలపై ఇచ్చిన హామీ ఏమైంది?
– స్వామినాథన్‌ నివేదిక బుట్టదాఖలు
– పరోక్షంగా బడా వ్యాపారులకే ప్రయోజనం
అన్నదాతలకు తామేదో గొప్ప మేలు చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న మోడీ ప్రభుత్వం ఇటీవల వారి కోసం రెండు ప్రకటనలు చేసింది. ఒకటి ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) ప్రకటన. రెండోది పీఎం కిసాన్‌ పథకం కింద 11 కోట్ల మంది రైతులకు రూ.2.42 లక్షల కోట్లు ఖాతాలలో జమ చేశామన్న ప్రకటన. మామూలుగా చూస్తే ఈ రెండు ప్రకటనలు రైతన్నల ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించినవిగా కన్పిస్తాయి. లోతుగా పరిశీలిస్తే మాత్రం ఇవి రైతులకు ఒక చేత్తో ఎంతో కొంత విదిలిస్తూ మరో చేత్తో పెద్ద మొత్తంలో లాగేసుకుంటున్నారన్న వాస్తవాన్ని, వారిపై చూపుతున్న కపట ప్రేమను బయటపెడతాయి
న్యూఢిల్లీ :
మోడీ ప్రభుత్వం నిర్ధారించిన కనీస మద్దతు ధరలు(ఎంఎస్పీ) 2014లో హామీ ఇచ్చిన దాని కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎంఎస్‌పీలను తక్కువగా ఇవ్వడమంటే రైతులకు కోట్లాది రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని నిరాకరించడం అన్న మాట. అదే సమయంలో పీఎం కిసాన్‌ పథకం పేరిట ప్రభుత్వం రైతులకు కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే విదిలిస్తోంది. సంవత్సరాల తరబడి రైతులు చవిచూస్తున్న పంట నష్టాన్ని ఈ చిన్న మొత్తం ఏ మాత్రం పూడ్చలేకపోతోంది. 2015-16 నుండి 2022-23 మధ్యకాలంలో రైతులు ధాన్యానికి సరైన కనీస మద్దతు ధర లభించక మొత్తంగా రూ.2,95,887 కోట్లు నష్టపోయారు. సుమారు మూడు లక్షల కోట్లు కోల్పోయారన్న మాట. ఇవి కేవలం రెండు పంటలకు సంబంధించిన వివరాలు మాత్రమే. మరో 12 వ్యవసాయ ఉత్పత్తులను కూడా కలుపుకుంటే అన్నదాతలకు ఆర్థికంగా కలిగిన నష్టం మరింత అధికంగానే ఉంటుంది. పీఎం కిసాన్‌ పథకం కింద ఇచ్చిన మొత్తంతో పోలిస్తే ఈ నష్టం చాలా చాలా ఎక్కువ.
ఎంత నష్టపోతున్నారు?
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ రైతు కమిషన్‌ చేసిన సిఫార్సులు అమలు చేస్తామని 2014లో మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్‌పీ యాభై శాతం అధికంగా ఉండా లని కమిషన్‌ సిఫార్సు చేసింది. ఉత్పత్తి వ్యయానికి సంబంధించి మోడీ ప్రభుత్వం వేస్తున్న లెక్కలలో మూలధనపు పెట్టుబడి, అద్దెలు వంటి అనేక ముఖ్యమైన అంశాలను చేర్చలేదు. 2022-23లో బియ్యం, గోధుమల సేకరణకు సంబంధించి ప్రభుత్వం ఎంఎస్‌పీలను ప్రకటించింది. బియ్యం ధర క్వింటాలుకు (110 కిలోలు) రూ.2,040గా నిర్ణయించారు. ఈ ధరకు ప్రభుత్వం 534 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది. అంటే రైతులకు అందింది రూ.1.09 లక్షల కోట్లు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారమైతే క్వింటాలుకు ఎంఎస్‌పీగా రూ.2,708లను నిర్ణయించాలి. ఇదే ధరకు ప్రభుత్వం 534 లక్షల టన్నుల బియ్యాన్ని కొని ఉంటే రైతులకు 1.5 లక్షల కోట్ల రూపాయలు అందేవి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయకపోవడంతో ధాన్యం రైతులు నష్టపోయింది రూ.41 కోట్లు. ఇది కేవలం 2022-23 సంవత్సరానికి సంబంధించిన సమాచారం మాత్రమే. 2015-16 నుండి 2022-23 వరకూ ప్రతి ఏటా ఇలాగే జరిగిందని అనుకుంటే ధాన్యం రైతులు నష్టపోయిన మొత్తం అక్షరాలా రూ.2.37 లక్షల కోట్లు. గోధుమ రైతులు కూడా ఎంఎస్‌పీ తక్కువ ఇవ్వడం వల్ల 2015-16 నుండి 2023-24 మధ్యకాలంలో రూ.58,460 కోట్లు నష్టపోయారు.
బహిరంగ మార్కెట్‌లో మరింత నష్టం
కనీస మద్దతు ధరలు తక్కువగా ఉండడంతో ప్రభుత్వానికి అమ్మడం ఇష్టంలేని రైతులు బహిరంగ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇలాంటి రైతులు ఎంత నష్టపోతున్నారో అంచనా వేయడం కష్టంగా ఉంటోంది. వాస్తవానికి ప్రభుత్వం సేకరించే వ్యవసాయ ఉత్పత్తుల పరిమాణం చాలా తక్కువ. 2022-23లో 1,355.4 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి అయితే అందులో ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 534 లక్షల మెట్రిక్‌ టన్నులే. మొత్తం ఉత్పత్తిలో ఇది 40% మాత్రమే. మిగిలిన నిల్వలలో రైతులు కొంతమేర సొంత అవసరాల కోసం తమ వద్దే ఉంచుకొని మిగిలినది బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్‌లో ఎంఎస్‌పీ కంటే తక్కువకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది.
ప్రభుత్వానికే లాభం
ఎంఎస్‌పీని తక్కువగా నిర్ణయించడం వల్ల ప్రభుత్వం లాభపడుతోంది. తన ఆర్థిక వనరులను ఆదా చేసుకుంటోంది. పరోక్షంగా మాత్రం బడా వ్యాపారులకు ప్రయోజనం కలిగిస్తోంది. అదే సమయంలో రైతుల కోసమంటూ పథకాలు ప్రవేశపెట్టి ఎన్నికల ప్రయోజనాలు పొందుతోంది. రైతులకు ప్రభుత్వం నుండి, అలాగే బడా వ్యాపారుల నుండి మెరుగైన ధర లభించేలా చూడాల్సిన బాధ్యత నుండి తప్పుకుంటూ వారిని ఆర్థిక నష్టాల సుడిగుండంలోకి నెడుతోంది.
వ్యాపారుల దోపిడీ
డబ్బులు వెంటనే కావాల్సిన రైతులు విధిలేని పరిస్థితులలో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులకు ఉత్పత్తులను అమ్ముకుంటున్నారు. దీంతో వారికి అధిక ధరల కోసం బేరమాడే శక్తి ఉండడం లేదు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోళ్లు చేస్తూ అన్నదాతలను దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఎంఎస్‌పీని పెంచితే ఆ మేరకు రైతులకు బహిరంగ మార్కెట్‌లో సైతం ఎంతో కొంత ఎక్కువ ధర లభించే అవకాశం ఉంటుంది. పైగా బహిరంగ మార్కెట్‌లో ధరలు ఒకేలా ఉండవు. ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఎంఎస్‌పీ తక్కువగా ఉంటే మాత్రం ధరలు ఎక్కడైనా తక్కువగానే ఉంటాయన్నది వాస్తవం.

Spread the love