– అధికారులనే పల్టీ కొట్టిస్తూ..
– నకిలీ సర్టిఫికెట్ల సృష్టిలో దిట్టలు
– ఆర్టీఏ ఏజెంట్ల పేరుతో అడ్డదారులు
– వలపన్ని పట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు
– ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ
– నకిలీ ఇన్సూరెన్స్ మొదలు, ఆధార్,ఐడీ కార్డుల తయారీలో దిట్టలు
– ఆరుగురిపై కేసు నమోదు, రిమాండ్‌కు తరలింపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వారికి ధనార్జనే ధ్యేయం. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడమే లక్ష్యం. నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కస్టమర్ నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని జేబులు నింపుకోవడంలో దిట్టలు. ఆర్టీఏ ఏజెంట్ల పేరుతో అడ్డదారులు తొక్కుతున్న ముఠా నకిలీ పత్రాలతో వాహనాలు రిజిస్ట్రేషన్లు మార్పిడి చేయించడం వారికి పరిపాటిగా మారింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ తతంగంపై ఎస్‌ఓటీ, ఆదిభట్ల పోలీసులు కన్నేశారు. నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆరుగురుపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు, ఆధార్, గుర్తింపు కార్డులు, నకిలీ గ్యాస్ బిల్లులు, వాహన అతివేగం లిమిట్ పత్రాలు, ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లతో పాటు పలు రకాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో మన్నెగూడ ఆర్టీవో కార్యాలయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అందుకు సంబంధించిన వివరాలు.
మన్నెగూడలోని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయాన్ని ఆసరా చేసుకొని పలువురు ప్రయివేటు ఏజెంట్లు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. లేని సర్టిఫికెట్లను సృష్టించడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఆర్టీఏ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేకుండా తమ తతంగాన్ని కొనసాగిస్తున్నారు. వేల రూపాయలను ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇటీవల పోలీసు అధికారి సమీప బంధువులు తమ వాహన రిజిస్ట్రేషన్ కోసం ప్రయివేటు ఏజెంట్లను ఆశ్రయిస్తే అసలు విషయం బయటపడింది. మన్నెగూడలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఉన్న లక్షిత జిరాక్స్ షాపులో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురితో కూడిన ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ల సందర్భంగా కార్యాలయానికి వస్తున్న కస్టమర్లను టార్గెట్ చేసుకొని అధిక డబ్బులు వసూలు చేయడం వారికి పరి పాటిగా మారింది. ఎలాంటి వారికైనా నకిలీ పత్రాలు సింపుల్‌గా తయారు చేస్తూ వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి నకిలీ ఇన్సూరెన్సులు, నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ గ్యాస్ బిల్లులు, వాహన అతివేగం లిమిట్ పత్రాలు, ఫేక్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని గత నాలుగు రోజులుగా విచారిస్తూ పూర్తి వివరాలు సేకరించారు. గతంలోనే ఇతర దేశస్థుడైన ఒక వ్యక్తికి వాహన రిజిస్ట్రేషన్ కోసం వస్తే అతను స్థానికంగానే ఉంటున్నట్టుగా గుర్తింపు కార్డులు తయారు చేసి వాహన రిజిస్ట్రేషన్ మార్పిడి కోసం ఆర్టీఏ కార్యాలయానికి పంపించారు. ఆ సందర్భంగా ఆర్టీఏ అధికారులకు అనుమానంతో పత్రాలను క్షుణంగా పరిశీలించారు. ఆ పత్రాలు నకిలీవని తేలడంతో ఆదిభట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని పోలీసులకు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. నాటి నుంచి ఆర్టీఏ కార్యాలయం బయట తతంగం నడుపుతున్న ఏజెంట్లపై పోలీసుల దృష్టి పడింది. దాంతో తీగలాగితే డొంక కదిలిన చందంగా ఒక్కొక్కరుగా బయటపడడం ప్రారంభమైంది. ఈ నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న సంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, కొంగల ఆనంద్, అడుశెట్టి వేణు, పుట్టబత్తిని శ్రీధర్, అనుపాటి శ్రీశైలం, చాపల యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ దాడులు రాజకొండ పోలీస్ కమిషనర్ చౌహాన్, డీసీపీ శ్రీనివాస్, ఎస్‌ఓటీ ఎల్‌బీ నగర్ డీసీపీ మురళీధర్, ఎస్‌ఓటీ ఏసీపీ వెంకన్ననాయక్, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఓటి ఇన్సక్టర్ సుధాకర్, ఆదిభట్ల సీఐ రవికుమార్ రెడ్డి, ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి ఈ దాడులు కొనసాగాయి.