– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిసినప్పటికీ అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రాణ, పంట, ఆస్తి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.69 చెరువులు తెగిపోయి, వాగులు పొంగడంతో మోరంచపల్లి ఊరు మునిగిందనీ, చెరువుల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని వాపోయారు. సాంకేతికపరమైన ఆలోచనలతో కాకుండా రాజకీయపరమైన అవసరాల కోసం చెక్ డ్యామ్‌లను నిర్మించారని చెప్పారు. సాంకేతికంగా అధ్యయనం చేయకుండా, శాస్త్రీయంగా ఇంజనీరింగ్ డిజైన్ చేయకుండా సీఎం కేసీఆర్ సొంత ఆలోచనలతో కాళేశ్వరంపై చెక్ డ్యాముల మాదిరిగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మించారని తెలిపారు. ఫలితంగా బ్యాక్ వాటర్‌తో మంథని, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో లక్షల ఎకరాల పంట నీట మునిగిందని వివరించారు. కాంగ్రెస్ శాసనసభ్యులు సీతక్క, పొదేం వీరయ్య, శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు గోదావరి వరదలతో తమ నియోజకవర్గాలకు ముప్పు పొంచి ఉందని వెంటనే రెస్క్యూ టీంలను పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆపరోపించారు. బీఆర్‌ఎస్ రాజకీయ సభల కోసం ప్రత్యేక విమానాలను పొరుగు రాష్ట్రాలకు పంపించిన కేసీఆర్ తెలంగాణ ప్రజలు అల్లాడిపోతుంటే మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. భద్రాచలం ముంపు నివారణకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని నయా పైసా ఇవ్వలేదన్నారు. వరద భీభత్సంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే స్పందించాలని కోరారు. వరదలపై సమీక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.