మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికులకు నష్టం

– ఆటో డ్రైవర్లు ఆవేదన
నవ తెలంగాణ-మిరుదొడ్డి: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకంతో తమ పొట్టకొట్టే విధంగా ఉందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంతో ప్రయాణికులు పూర్తిస్థాయిలో బస్సులలో ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారిందన్నారు. కొద్దిరో జులుగా డీజిల్‌ డబ్బులు కూడా రావడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవ ర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆటో డ్రై వర్లకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ నలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. బాలమలు, నాగరాజు, మహెందర్‌, మహేశ్‌, హరీశ్‌, శంకర్‌ రాజు, కిరణ్‌, కుమార్‌, బాబు, కిరణ్‌ పాల్గొన్నారు.
నవతెలంగాణ దుబ్బాక రూరల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా ఆటో డ్రైవర్లంతా రోడ్డుపై పడ్డారని, దీంతో కుటుంబ పోషణతో పాటు ఫైనాన్సుల్లో తెచ్చిన అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఆటో కార్మికులున్నారని, తమను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరారు. బుధవారం దుబ్బాక మండలంలోని సిద్దిపేట మెదక్‌ జాతీయ రహదారిపై తిమ్మాపూర్‌ స్టేజి ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ద గుండవెళ్లి ఆటో యూనియన్‌ అధ్యక్షులు గూడురీ స్వామి మాట్లాడుతూ ఫైనాన్సుల్లో తెచ్చిన అప్పులు చెల్లించలేని పరిస్థితిలోకి ఆటో కార్మిక రంగాన్ని ఈ ప్రభుత్వం నెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ప్రయాణ పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదని, ఆటోలలో మహిళ ప్యాసింజర్లు ఎక్కకపోవడంతో రోజంతా తిరిగిన చేతికి వంద రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆటో యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు మల్లుగారి అశోక్‌, మద్ది బాలయ్య , దేవేందర్‌ ఎల్లం, అశోక్‌, యాదగిరి ఉన్నారు
నవతెలంగాణ-బెజ్జంకి: ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తుండడంతో మా బతుకుదెరువు దెబ్బతింటోందని, ఇప్పుడు మా బతుకుదెరువెట్లని అవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని ఆటోడ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపాలని కోరుతూ బుధవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆటో యూనియన్‌ అద్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఆటోడ్రైవర్లు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రం నుంచి నలువైపులా సుమారు 40 కిలోమీటర్ల వరకు ఆటోలతో జీవనం సాగిస్తున్నారని, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడంతో ఆటోల్లో ప్రయాణికులు తగ్గి తమ ఉపాధికి దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆటోలకు ఇంధన ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొందని, తమకూ ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదు
గత 32 ఎండ్లుగా ఆటోపై ఆధారపడి జీవిస్తున్నాను. ఇన్నెండ్లలో ఈ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించాం.ఉచిత ప్రయాణంతో ఆటో కార్మికుల ఉపాధికి భారీగా గండి పడింది.కనీసం ఇంధన ఖర్చులు కూడా రాని దుస్థితి ఏర్పడింది.ఇప్పుడు ఉపాధి దెబ్బతింటే అప్పులపాలవుతాం.ప్రభుత్వం మా సంక్షేమం గురించి ఆలోచన చేయాలి.
– ఎలకపల్లి ముత్తయ్య, ఆటోకార్మికుడు
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రయాణికులను చేరవేయడమే ప్రధాన జీవానోపాధిగా ఆటోలపై ఆధారపడిన కార్మికులు ప్రతినెలా తమ వాహన ఫైనాన్స్‌ సహా కుటుంబ పోషణ, పిల్లల చదువులకు వచ్చే అరకొర ఆదాయం సరిపోవడం లేదు. పైగా అప్పుల పాలై అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు కారణంగా ఆటోల్లో ప్రయాణికులు తగ్గి ఆదాయానికి గండిపడుతుంది.అన్ని వర్గాలనూ చేరదీస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటోకార్మికుల సంక్షేమాన్ని చేపట్టి ప్రతినెలా జీవన భతి అందజేయాలి.
– రామంచ మల్లేశం, ఎస్‌ఎల్‌ఎన్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు

Spread the love