తెలంగాణలో జోరుగా బెట్టింగులు..!

నవతెలంగాణ హైదరాబాద్: ఇప్పటి వరకు క్రికెట్‌, ఇతరత్రా పోటీలపై బెట్టింగులు నిర్వహించిన ఆన్​లైన్ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వాటి కన్ను పడింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బరిలోకి దిగిన పందెం రాయుళ్లు… కాయ్ రాజా కాయ్ అంటూ జోరుగా బెట్టింగ్స్ కాస్తున్నారు. ఈ సారి పలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు. వందకు వెయ్యి, వెయ్యికి లక్ష అంటూ బెట్టింగ్ బంగార్రాజులు పందెలాలు కాస్తున్నారు. ఇక పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో అయితే.. ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారని కూడా బెట్టింగ్స్ నడుస్తున్నాయట. లక్షలు కాదు.. కోట్లలో బెట్టింగ్స్ జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు. రాష్ట్రంలో ఎవరిని చూసినా ఇదే చర్చ. ఊరు వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గల్లిలోనూ ఏ నలుగురు గుమిగూడినా ఇదే చర్చ. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లో ఏ పార్టీ, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంచనాలపై వేర్వేరు బెట్టింగ్‌ సంస్థలు పందేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు ప్రచారకర్తలుగా ఆయా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లకు విస్తృత ప్రచారం కల్పిస్తుండటం, వెబ్‌సైట్లు, బస్టాపులు, ఆటోలపై వారి ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు.
 గెలిస్తే రెట్టింపు డబ్బులు
బీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటాయి. అంటూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సంస్థలు ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని.. పందెంలో గెలిచిన వారు అంతకంత డబ్బు సంపాదించుకోవచ్చని ఊరిస్తున్నాయి.
అమాయకులకు ఎర
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం రకరకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే బెట్టింగ్‌ సంస్థలు అంతకు మించి హడావుడి పెంచాయి. అమాయకులను వలలో వేసుకునేందుకు రవాణా వాహనాలు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు, ఇతరత్రా రద్దీ ప్రాంతాల్లోని టీకొట్లు, పాన్‌షాప్‌లు, దుకాణాల్లో గోడపత్రాలు అంటించి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. రాష్ట్ర ఓటర్లే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. యువత, వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడే వారు ఎక్కువగా వాటికి ఆకర్షితులవుతున్నారు. తక్కువ సమయంలో, కష్టపడకుండా.. సులువుగా డబ్బు సంపాదించాలన్న కోరికతో ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. ఈ సారి ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తుండటంతో.. జనాల అటెన్షన్ అంతా ఫలితాలపై ఉంది.  తెలంగాణ ప్రజలతో పాటు.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Spread the love