నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని మెదక్‌లో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈరోజు ఉదయం అందరూ చూస్తుండగానే డిగ్రీ విద్యార్థినిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాయడానికి పట్టణంలోని ప్రభుత్వ కాలేజీకి వచ్చిన యువతిపై చేతన్ అనే యువకుడు ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. అతని నుంచి తప్పించుకోవడంతో ఆమె గాయాలతో బయటపడింది. యువతి చేతికి తీవ్ర గాయాలు కావడం గమనించిన స్థానికులు చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో కుటుంబ సభ్యులు వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు చేతన్ అప్పటికే అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ప్రస్తుతం అతని కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.