నేర్చుకోడానికి ఇష్టపడతాను

Love to learnట్వింకిల్‌ ఖన్నా…. బాలివుడ్‌లో ప్రముఖ నటిగా పేరు. అక్షరుతో పెండ్లి తర్వాత పిల్లలు, కుటుంబానికే పరిమితం కాలేదు. తనలోని రచయిత్రిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు ‘వెల్‌కమ్‌ టు ప్యారడైజ్‌’ పుస్తకంతో అభిమానుల ముందుకు వచ్చింది. మిసెస్‌ ఫన్నీబోన్స్‌ కాలమిస్టుగా ఎదుర్కొన్న ఒత్తిడి, 50 ఏండ్ల వయసులో తిరిగి తాను కాలేజీకి వెళ్లడం, కొత్త విషయాలు నేర్చుకోవడం గురించి ఇలా ఎన్నో మనతో పంచుకుంటున్నారు. ఆ వివరాలు నేటి మానవిలో…
ట్వింకిల్‌ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా చూస్తే ఆమె ఎంత సరదా మనిషో తెలుస్తుంది. ఆమె పిల్లలు (21, 12 ఏండ్ల) వారి స్నేహితులతో చాట్‌ చేయడం చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నారు. వాస్తవానికి ఆమెకు కొత్త విషయాలు నేర్చుకోవడమంటే ఎంతో ఆసక్తి. ఒక రచయిత్రిగా ఆమె ప్రస్తుతం తన నాల్గవ పుస్తకమైన వెల్‌కమ్‌ టు ప్యారడైజ్‌ (జగ్గర్‌నాట్‌)ను విడుదల చేశారు. ఆమె గత ఏడాది డిసెంబర్‌లో తన యాభైవ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐదు కథల సమాహారమైన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
50ల్లో చదువు…
ట్వింకిల్‌ కొన్నేండ్ల కిందట మాస్టర్స్‌ చేసేందుకు గోల్డ్‌స్మిత్స్‌, లండన్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ‘నా ఉద్దేశ్యంలో నేను ఇప్పుడు చదవ లేకపోతే ఇక ఎప్పటికీ చదవలేను. అందుకే ఐదు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసాను. అయితే గోల్డ్‌ స్మిత్స్‌ నా మొదటి ఎంపిక. అందులోనే చేరాను!’ అంటూ పంచుకున్నారు. చదువు కోసం ఒక ఏడాది దేశం విడిచి పెట్టేం దుకు ఆమె తన 10 ఏండ్ల కూతుర్ని కూడా తనతో తీసుకెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కరోనా వల్ల ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. తర్వాత ఆమె క్లాసులకు వెళ్లడం, కొత్త స్నేహితులను సంపాదించుకో వడంతో పాటు విమర్శనాత్మక వ్యాసాలు, పరిశోధనలు రాయడంపై దృష్టిపెట్టారు. ఇది ఆమె ఇంతకు ముందెన్నడూ చేయని పని.
వెల్‌కమ్‌ టు ప్యారడైజ్‌
తన నాల్గొవ పుస్తకం గురించి చెబుతూ ‘వెల్‌కమ్‌ టు ప్యారడైజ్‌ పుస్తకం రెండు విషయాల సమ్మే ళనం. ఒకటి కచ్చితంగా నేను అనే ఓ వ్యక్తి. అలాగే నేను చేయవలసిన పనుల జాబితా కూడా ఉంది. ఈ రెండింటి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. మొదట నేను ఓ వ్యక్తిని. తర్వాత ఓ కాలమిస్టుని. 10 ఏండ్లుగా కాలమ్‌ లు రాస్తున్నాను. ఈ పదేండ్లు ఎలా గడిచిపో యాయో నాకే తెలియదు. కాబట్టి ఒక సమస్య ను వివరించడానికి 850 నుండి 900 పదాలు ఉపయోగిస్తాను. నేను రాసేవి చాలా క్లుప్తంగా ఉండేలా శిక్షణ పొందాను. కాబట్టే నా కథ లైనా, నవలైన పరిమితిగా ఉంటాయి’అన్నారు.
కచ్చితంగా చెప్పడం కష్టం
ఈ పుస్తకాన్ని రాయడం మీరు ఎప్పుడు ప్రారంభించారు అని అడిగితే ‘ఒక పుస్తకం రాయడం ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పడం ఏ రచయితకైనా కష్టం. ఈ పుస్తకంలోని జెల్లీ స్వీట్స్‌ (పుస్తకం యొక్క చివరి కథ) గురించే చూస్తే ఎనిమిదేండ్ల కిందటే నాకు ఈ కథ గురించిన సమాచారం నాకు తెలుసు. అప్పటి ఎడిటర్‌కి కథను వివరించాను. ఆమె ‘మీరు దీన్ని ఎందుకు రాయడం లేదు? ఇది ఒక అందమైన కథ’ అన్నారు. అయితే నేను దేని గురించి రాయాలన్నా బాగా ఆలోచిస్తాను. కొంత సమయం తీసుకుంటాను. నా మనసులో ఆ కథ గురించి ఆలోచన మొదలైనప్పుడే రాయడం ప్రారంభిం చినట్టు. కాబట్టి ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడం చాలా కష్టం. ఇది నిరంతరం జరిగే ఓ ప్రక్రియ’ అంటూ ట్వింకిల్‌ సమాధానం చెప్పారు.
ఒక వ్యక్తి ఆధారంగా రాయను
మీ రచనల్లో ఎక్కువ శాతం వాస్తవాలే కనబడతాయనుకుంటా అంటే ‘ఓ రచన గురించి నాలో ఆలోచన వచ్చినపుడు వెంటనే నోట్స్‌ రాసుకుంటాను. ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగితే తిరిగి వచ్చి దాని గురించి ఆలోచిస్తాను. ఏ విషయంలోనూ నాకు మొహమాటం ఉండదు. ఎవరైనా చేసిన పని నాకు నచ్చకపోతే వెంటనే వాళ్ళకు చెప్తాను. ఆ విషయం వెంటనే నా నోట్స్‌లో ఓ పేజీగా మారిపోతుంది. ఆ సంఘటనను ఏదో ఒక కథలో ఉపయోగించుకుంటాను. అయితే నేనెప్పుడూ ఒక వ్యక్తి ఆధారంగా కథను రూపొందించాలని అనుకోను. చాలా మంది వ్యక్తుల నిజ జీవితంతో పాటు నా ఊహాత్మక వ్యక్తుల నుండి తిరిగి ఒక వ్యక్తిని తయారు చేస్తాను’ అని ఆమె అంటున్నారు.
ఒత్తిడిని తగ్గించుకోవడం నేర్చుకుంటున్నా
ఐదేండ్ల తర్వాత ఈ పుస్తకం వచ్చింది. ప్రచురించ డానికి ఏమైనా ఒత్తిడి ఎదుర్కొన్నారా అంటే ‘లేదు, వాస్తవానికి నేను గత ఐదేండ్లుగా చాలా బిజీగా ఉన్నాను. కాబట్టి నాకు ఎటువంటి ఒత్తిడి లేదు. నేను ట్వీక్‌ ఇండియాను ఏర్పాటు చేశాను. దీనికి రెండేండ్లు పట్టింది. ఆ సమ యంలోనే ఆక్స్‌ఫర్డ్‌లో ఆరు నెలలు ఆన్‌లైన్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత ఏడాది పాటు మాస్టర్స్‌ చేసాను. ఇవన్నీ చేస్తున్నా ఇంకా చాలా సమయం ఉందనిపించింది. కొంత కాలం స్తబ్దుగా ఉన్నాను. ఒక వైపు చాలా పనులు చేస్తున్నట్టు అనిపించేది. అయితే వ్యంగ్యం ఆధారంగా వచ్చిన నా మిసెస్‌ ఫన్నీబోన్స్‌ కాలమ్‌ కోసం కొంత ఒత్తిడిని అనుభవించాను. నా కథల్లో ఫన్నీ ఉండాలనే తపన నాలో ఎప్పుడూ ఉండేది. దాని గురించి నా సంపాదకులతో అనేకసార్లు ఆర్గిమెంట్‌ చేసేదాన్ని. అయితే ఈ పుస్తకంలో నేను ఆ ఒత్తిడిని అనుభవించలేదు. కథకు ఉపయోగపడేవి మాత్రమే రాశాను. అందులో హాస్యం ఉన్నా, డార్క్‌ హ్యూమర్‌ ఉన్నా అదంతా కథలో భాగమే. ఫన్నీ కోసం ప్రత్యేకంగా పదాలు ఏమీ జోడించలేదు. కాబట్టి ఎలాంటి ఒత్తిడినీ ఎదుర్కో లేదు. అలాగే నేను ఇప్పుడు ఒత్తిడి ని తగ్గించుకోవడం ఎలాగో నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను’ అంటూ ముగించారు. వాస్తవానికే ఎక్కువ ప్రాధాన్యం
మీరు రాసే కొన్ని విషయాలు చాలా తీవ్రంగా, సాపేక్షంగా ఉంటాయి. మీరు వారి జీవితాన్ని చాలా దగ్గరగా చూసినట్లు అనిపిస్తుంది, ఇదెలా సాధ్యం అంటే ‘నా ప్రక్రియ ఏమిటంటే నేను రాయడం ప్రారంభించే ముందు వ్యక్తుల పాత్రల స్కెచ్‌లను చేస్తాను. అలా చేయడం వల్ల రాసేటప్పుడు అవన్నీ నా మదిలో అలా నిలిచిపోతాయి. నేను రచనల్లో వాస్తవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అయితే కల్పన కూడా సత్యాన్ని ప్రదర్శించే ఒక మార్గమే. 50 ఏండ్లు వచ్చాయి కాబట్టి ఇప్పటికే నా జీవితంలో చాలా చూశాను. ఇవన్నీ నా రచనల్లో ప్రతిబింబిస్తాయి’ అని సమాధానం చెప్పారు.

Spread the love