పశ్చిమ దేశాల ఆధిపత్యం ముగుస్తోంది! : లవ్రోవ్‌

Western countries
Dominion is ending! : Loverovపశ్చిమ దేశాలకు ప్రతిగా నూతన ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రాలు ఆవిర్బవించాయని, సహకారానికి గల అవకాశాలను అందిపుచ్చుకుని సంబంధాలను బలోపేతం చేశాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ అన్నారు. చైనా, ఇండియా, ఇరాన్‌, గల్ప్‌ దేశాలు, లాటిన్‌ అమెరికన్‌ అండ్‌ కర్రిబియన్‌ స్టేట్స్‌(సీఈఎల్‌ఏసీ)వంటి గ్రూపులు ఇలా ఆవిర్బవించిన ఆర్థిక శక్తులుగా ఉన్నాయని లవ్రోవ్‌ చెప్పాడు. గత ఐదు శతాబ్దాలుగా పశ్చిమ దేశాలు ప్రపంచంపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఈ శకం ముగిసింది. పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ముగింపు పలకటానికి బహుళ ద్రువ కేంద్రాలకు మరికొంత సమయం పడుతుందని కూడా ఆయన అన్నారు.
ఇదే సందర్భంగా అమెరికా డాలర్‌ పైన ఆధారపడకుండా తమ స్వంత కరెన్సీని ఏర్పాటు చేసుకునే దిశగా లాటిన్‌ అమెరికన్‌ అండ్‌ కర్రిబియన్‌ స్టేట్స్‌(సీఈఎల్‌ఏసీ) ఆలోచించవలసిందిగా బ్రెజిలియన్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా సూచించిన విషయాన్ని లవ్రోవ్‌ గుర్తు చేశారు. అలాగే బ్రిక్స్‌ గ్రూపు దేశాలు ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కూడా లూలా సూచించిన విషయాన్ని కూడా లవ్రోవ్‌ ఉటంకించాడు. అమెరికా ప్రపంచీకరణ పేరుతో తను రూపొందించిన నియమాలను తానే ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా ఆంక్షలను విధిస్తుండటంవల్ల ప్రపంచ దేశాలకు ప్రత్యామ్నాయ ఆలోచనలు అవసరమౌతున్నాయని లవ్రోవ్‌ అన్నారు.
ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులలో చైనా పలుకుబడి పెరిగిన తరువాత ప్రపంచ వాణిజ్య సంస్థ విభాగమైన సమస్యల పరిష్కార విభాగాన్ని అమెరికా పనిచేయకుండా చేసిందని లవ్రోవ్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాలు నెరవేరేవరకే పనికివచ్చే నియమాలను అమెరికా రూపొందిస్తుందని, ఎప్పుడైతే ఇతర దేశాలు అమెరికాకంటే సమర్థవంతంగా పనిచేయటం మొదలవుతుందో అప్పుడే అమెరికా నియమ, నిబంధనలను మారుస్తుందని లవ్రోవ్‌ చెప్పారు.
ప్రపంచంలో నూతన ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తుల కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్న కారణంగా ఈ శకం ముగింపునకు వస్తోందని లవ్రోవ్‌ ప్రకటించారు.

Spread the love