గతం కంటే తగ్గిన పోలింగ్‌

గతం కంటే తగ్గిన పోలింగ్‌– 2019తో పోల్చితే 3.82 శాతం తగ్గిన ఓటింగ్‌
– అన్ని దశల్లోనూ ఇదే పరిస్థితి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశల పోలింగ్‌ మిగిలి ఉంది. అయితే ముగిసిన ఈ ఐదు దశల పోలింగ్‌, గత 2019 లోక్‌సభ ఎన్నికల కంటే తక్కువగానే నమోదైంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఓట్లు పోలయ్యాయి. 2019లో ఈ 102 స్థానాల్లో 69.96 శాతం ఓట్లు పోలవ్వగా, ఈసారి 66.14 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. అంటే గతసారి కంటే ఈ సారి 3.82 శాతం ఓటింగ్‌ తగ్గింది. రెండో దశలో 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. గత ఎన్నికల్లో ఈ 88 స్థానాల్లో మొత్తం 70.09 శాతం పోలింగ్‌ జరగగా, ఈసారి 66.71 శాతం ఓటింగ్‌ నమోదైంది. అంటే గతసారి కంటే ఇప్పుడు 3.38 శాతం ఓటింగ్‌ తగ్గింది. మూడో దశలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 2019లో ఈ 93 సీట్లలో మొత్తం 66.89 శాతం పోలింగ్‌ జరగగా, ఈసారి 65.68 శాతం ఓటింగ్‌ జరిగింది. అంటే గతసారి కంటే ఇప్పుడు 1.21 శాతం ఓటింగ్‌ తగ్గింది.
నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. 2019లో మొత్తం 69.12 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఈసారి 69.16 శాతం ఓటింగ్‌ జరిగింది. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక ప్రచారాలను ప్రారంభించింది, దీని ప్రభావం నాలుగో దశ ఓటింగ్‌లో కనిపించినట్టు తెలుస్తోంది. గతం కంటే 0.04 శాతమే పెరిగింది. ఇక మే 20న జరిగిన ఐదో దశలో రాత్రి 11:30 గంటల సమయానికి 60.09 ఓటింగ్‌ జరిగింది. 2019లో ఈ స్థానాల్లో మొత్తం 62.01 శాతం ఓటింగ్‌ నమోదైంది. అంటే 1.92 శాతం తగ్గింది.

Spread the love