– చెరువుల బఫర్ జోన్లు కలిశాయన్న అనుమానాలు
– దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు
– 10-15శాతం ఎఫ్‌టీఎల్, బఫర్‌లో ఉన్నట్టు గుర్తింపు
– మేడ్చల్ జిల్లాలో 40వేలకు పైగా దరఖాస్తుల పరిశీలన
– మిగతా చోట్ల అదే పనిలో ప్రభుత్వ సిబ్బంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నట్టు అనుమానాలు రావడంతో అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మూడు దశల్లో పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో అధికారులు ఆ పనిలో ఉన్నారు. క్రమబద్దీకరణ దరఖాస్తుల పరిష్కార బాధ్యతలను ప్రభుత్వం స్థానిక సంస్థలను పర్యవేక్షించే అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ క్రమంలో ఆ పనుల్లో అధికారులు నిమగమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి 25.67 లక్షల దరఖాస్తులు అందాయి. అందులో పురపాలక సంఘాల పరిధిలో 10.54 లక్షలు, గ్రామ పంచాయతీల పరిధిలో 10.76లక్షలు, మిగిలినవి కార్పొరేషన్ల పరిధిలో వచ్చాయి. ప్లాట్లకు సంబంధించినవి 25.53లక్షలు కాగా, లేఅవుట్ల దరఖాస్తులు 0.13లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పరిశీలించినవి 4.50లక్షలు మాత్రమే. ఆమోదం పొందినవి 70వేల లోపే.. ఈ దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ, మున్సిపాల్టీల అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల్లో కొన్ని బఫర్ జోన్లలో ఉన్నట్టు అనుమానాలు రావడంతో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో భూములను పరిశీలిస్తున్నారు. జియో మ్యాపింగ్ సరిహద్దులు, హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లోని చెరువుల ప్రాథమిక నోటిఫికేషన్, తుది నోటిఫికేషన్లను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్లో ఉంటే వాటిని తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తూంకుంట, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, పోచారం, ఘట్‌కేసర్ మున్సిపాల్టీలు, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్ల పరిధిలోని దరఖాస్తుల్లో 10 నుంచి 15శాతం ఇలాంటివే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
హైడ్రా ప్రభావం
క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కార బాధ్యతలను ప్రభుత్వం స్థానిక సంస్థలను పర్యవేక్షించే అదనపు కలెక్టర్లకు అప్పగించిన విషయం తెలిసిందే. వీటిని మూడంచెల్లో (ఎల్-1, ఎల్-2, ఎల్-3) పరిష్కరించాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దరఖాస్తులను పరిశీలించాక, అధికారులు ఆమోదించేలా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో దరఖాస్తులను ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సూచనల ఆధారంగా మున్సిపల్ అధికారులు పరిష్కరించారు. హైడ్రా ఏర్పాటుతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి చెరువుల సరిహద్దులు, బఫర్ జోన్లను నిర్ధారించి దరఖాస్తుదారు పేర్కొన్న సర్వే నెంబర్ విస్తీర్ణం బఫర్ జోన్‌లోకి వస్తుందా..? అన్న అంశాలను తేల్చనున్నారు. గ్రామ పరిధిలోని నక్ష, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన జీడీపీఎస్‌లతో సర్వే నిర్వహించనున్నారు. ఇలాంటివి జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామాల్లో కలిపి దాదాపు 40వేలకు పైగా క్రమబద్దీరణ దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా మొత్తం లక్షా 70వేల వరకు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు రాగా.. ఇప్పటి వరకు దాదాపు 3వేలకు పై చిలుకు మాత్రమే పరిష్కరించినట్టు ఓ అధికారి తెలిపారు.
కొత్త దరఖాస్తు చేసుకుంటేనే ఆమోదం
1.ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులుంటే ప్రాథమిక దశ (ఎల్-1)లోనే అధికారులు తిరస్కరిస్తారు. దరఖాస్తుదారులకు మెస్సేజ్‌లు, ఫోన్లు, ఈ మెయిల్స్ ద్వారా తెలుపనున్నారు.
2.బఫర్ జోన్‌లో ఉంటే.. ఆ పరిధిని తొలిగించి సర్వే చేయించుకుని కొత్త దరఖాస్తు చేసుకున్నాకే క్షేత్రస్థాయిలో రెండోసారి పరిశీలించి ఆమోద్ర ముద్ర వేయనున్నారు.
3.ఎల్-2 దశలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు అభ్యంతరం చేసినా తిరస్కరిస్తారు.
4.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామాల్లో దాదాపు 40వేలకు పైగా క్రమబద్దీరణ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
10 శాతం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోకి..
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1820 చెరువులుండగా, 10 శాతం చెరువులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లుగా మారిపోయాయంటూ స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. సహజ సిద్ధమైన నీటివనరులు, చెరువులు అధికంగా ఉన్న కూకట్‌పల్లి, మేడ్చల్, ఉప్పల్, ఘట్‌కేసర్ మండలాల్లో నీటిపారుదల శాఖ అధికారులు చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్‌గా మార్చేశారు. మేడ్చల్ మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో రెండు చెరువుల్లో కొన్నేండ్ల నుంచి ప్రవాహం ఆగిపోవడంతో బఫర్ జోన్‌ను 20 మీటర్లు వెనక్కి జరిపారు. ఇరిగేషన్ శాఖ ఇండ్లకు నిరభ్యంతర పత్రాలను ఇచ్చింది.
పైసా వసూల్..
హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువుల హద్దుల్లో బఫర్ జోన్లను కొందరు నీటిపారుదల శాఖ అధికారులు మార్చారని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో జలవనరులు.. చెరువుల బఫర్ జోన్లలో ఈ మార్పులు చేర్పులు చేశారని, జిల్లా నీటిపారుదల శాఖ అధికారుల్లో కొందరు సహకారం అందించినట్టుగా గుర్తించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ హద్దులను గుర్తించే క్రమంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.