ఎమ్మెల్సీగా చరిత్ర సృష్టించారు

శశి యాదవ్‌... విద్యార్థి దశ నుండే సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఐప్వా నాయకురాలిగా మహిళా హక్కుల కోసం గళమెత్తాశశి యాదవ్‌… విద్యార్థి దశ నుండే సమస్యలపై పోరాటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఐప్వా నాయకురాలిగా మహిళా హక్కుల కోసం గళమెత్తారు. ప్రస్తుతం ట్రేడ్‌ యూనియన్‌ నాయకురాలిగా నిత్యం ప్రజలతో మమేకమై అట్టడుగు వర్గాల గొంతుకయ్యారు. ఇటీవల బీహార్‌ రాష్ట్రంలో యంయల్‌ పార్టీ నుండి తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆర్జేడీ, కాంగ్రేస్‌ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించారు. సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన అనుభవంతో ఓ ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రణాళికను రూపొందించుకుంటున్న ఆమె పరిచయం నేటి మానవిలో.
శశి యాదవ్‌ 1969 నవంబర్‌ 4న జంషెడ్పూర్‌లో జన్మించారు. తండ్రి చంద్రశేఖర ప్రసాద్‌, తల్లి నిర్మల. శశి ఇంటర్మీడియట్‌ వరకు విద్యను అభ్యసించారు. భాగల్పూర్‌లోని సాహెబ్‌ గంజ్‌ స్వస్థలం. ఆమె తండ్రి చంద్రశేఖర ప్రసాద్‌ నక్సల్‌ బరి ఉద్యమ నాయకుడు. యంయల్‌ పార్టీ ప్రముఖ నేత, కార్మిక ఉద్యమ నాయకుడు. ఆయన రచయిత కూడా. లేబర్‌ మూమెంట్‌ ఆఫ్‌ జంషెడ్‌ పూర్‌ అనే పుస్తకాన్ని రాశాడు. తల్లి మహిళా సంఘం ఐప్వా నాయకురాలు.
విద్యార్థి దశ నుండే…
వీరి కుటుంబం యంయల్‌ పార్టీ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఉద్యమ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో శశి అఖిలభారత విద్యార్థి సంఘంలో మొదట పనిచేశారు. తర్వాత ఐప్వా ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. విద్యార్థి, యువజన మహిళ ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉంటూ ట్రేడ్‌ యూనియన్‌ నాయకురాలుగా ఎదిగారు. కిందిస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వరకు అనేక బాధ్యతలను ఆమె నిర్వర్తించింది.
కార్మిక ఉద్యమ నాయకురాలిగా..
కార్మిక సంఘం ఏఐసీసీటీయూ, మహిళా సంఘం జాతీయ స్థాయి నాయకురాలిగా ఆమె ఉన్నారు. ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఉమెన్‌ అసోసియేషన్‌ జాతీయ ఉపాధ్యక్షురాలుగా, స్కీం వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీపీఐ(యంయల్‌) లిబరేషన్‌ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఆశా వర్కర్స్‌, అంగన్వాడి వర్కర్స్‌, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇతర శ్రామిక మహిళల కోసం, వారి హక్కులు, కనీస వేతనాల కోసం అనేక ఉద్యమాలు రూపొందించి వాటికి నాయకత్వం వహించారు. ట్రేడ్‌ యూనియన్‌ నేషనల్‌ నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ రాష్ట్రంలో స్కీం వర్కర్స్‌కు 6000 కంటే ఎక్కువ వేతనం రావడం లేదు. గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని, పర్మినెంట్‌ చేయాలని జరిగిన అనేక పోరాటాలకు ఆమె నాయకత్వం వహించారు. అణగారిన వర్గాల కోసం నిరంతరం పనిచేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. ఈ విధంగా నిత్యం ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకురాలుగా ప్రజలకు ఆమె సుపరిచితురాలు.
ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ….
శశి ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆమెలోని పోరాట స్ఫూర్తిని గమనించిన పార్టీ ఆమెకు ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరించింది. ఇప్పటివరకు మూడుసార్లు దిఘా, హిల్సా, మసౌరిÛ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేగా, మూడుసార్లు దరంగా, నలంద, బార్‌ నియోజకవర్గాల నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ ప్రజల మద్దతును కూడా గట్టి ప్రజా నాయకురాలిగా ఎదిగారు. ఆమెకు లభించిన ఓట్ల శాతం చూస్తే ప్రజలు ఆమెను ఎంతగా ఆదరిస్తున్నారో అర్థమవుతుంది.
నిబద్ధతను చాటుకున్నారు
మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందు ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. యంయల్‌ పార్టీ నుండి ఓ మహిళ ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఇదే తొలిసారి. శశిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ పార్టీ మహిళా ప్రాతినిధ్యం పట్ల తన నిబద్ధతను చాటుకుందని జాతీయస్థాయి మీడియా ప్రచారం చేసింది. మహిళల హక్కుల కోసం సీపీఐ(యంయల్‌) లిబరేషన్‌ మొదటి నుంచి గళం వినిపిస్తుందని, ఆ పార్టీ ఎప్పుడూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందని, దీనిని ఇతర పార్టీలు అనుసరించాల్సిన అవసరం ఉందని వాఖ్యానాలు వెలుబడ్డటం గమనార్హం.
అట్టడుగు వర్గాల గొంతుక
శశి యాదవ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. యంయల్‌ పార్టీ నుండి ఎన్నికైన తొలి మహిళగా చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు. ప్రత్యేకంగా బీహార్‌ శాసనమండలిలో కమ్యూనిస్టుల గొంతుక ప్రతిధ్వనించడం, ఆ అవకాశం శశికి దక్కడం బీహార్‌ రాజకీయాల్లో కీలకమైన పరిణామం. ప్రశ్నించే గొంతుకగా అట్టడుగు వర్గాల సమస్యల్ని లెజిస్లేటి కౌన్సిల్లో ఆమె ప్రస్తావించనున్నారు. కార్మిక వర్గ సమస్యల్ని చర్చకు పెట్టేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘకాలం పోరాటాలు చేసిన అనుభవం కలిగిన నాయకురాలుగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు ప్రణాళికను రూపొందించుకున్నారు. బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీలో వామపక్షాల బలం పెరగడంతో పాటు శాసనమండలిలో ప్రాతినిధ్యం దక్కడం వామపక్ష శిబిరానికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన శశికి విప్లవ జేజేలు తెలుపుదాం.
– మామిండ్ల రమేష్‌ రాజా, 7893230218

Spread the love