‘అవినీతి రాజధాని’గా మధ్యప్రదేశ్‌ : రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ – భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని ‘అవినీతి రాజధాని’గా మార్చివేసిందని కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. రాష్ట్రంలోని నీముచ్‌ జిల్లాలోని జావద్‌లో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. బడా పారిశ్రామిక వేత్తలతో కుమ్మక్కయి బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌ ప్రజలను దోచుకుందని విమర్శించారు. ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కుమారుడి వీడియో గురించి కూడా రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. ఈ వీడియోలో తోమర్‌ కుమారుడు మీ డబ్బును దొంగిలిస్తున్నట్లు కనిపించిందని రాహుల్‌ తెలిపారు. ‘మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తక్కువ కాదు. రైతులు, కార్మికుల నుంచి డబ్బులు దోచుకోవడంలో తోమర్‌తో పోటీ పడుతున్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు. అదానీ వంటి పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకే నోట్ల రద్దు జరిగిందని, నోట్ల రద్దు చిన్న దుకాణాల యజమానులు, సామాన్య ప్రజలు తీవ్రంగా దెబ్బతీసిందని రాహుల్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 500 ఫ్యాక్టరీలను స్థాపించామని బిజెపి ప్రభుత్వం ‘బహిరంగంగా అబద్ధాలు’ అడుతుందని, నీముచ్‌లో అలాంటి ఫ్యాక్టరీని ఒక్కటైనా చూశారా.. అని రాహుల్‌ ప్రజలను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కుల గణన నిర్వహిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 230 మంది ఎమ్మెల్యేలు ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love