మాడి మసై పోతావ్‌..

Madi masai potao..– కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ చేసి చూడు
– కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మండిపాటు
– కారు అనుం చెడ్డది..తూకానికి అమ్మేరు..
– పాలమూరు ఎంపీగా గెలిచిన నీవు ఏం చేశావ్‌
– గడీల దొరసానిని ఈ ప్రాంత ప్రజలు నమ్మబోరు
– కేసీఆర్‌ కమీషన్లకు మోడీ కక్కుర్తి : మహబూబ్‌నగర్‌లో నామినేషన్‌ ర్యాలీ,మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ జనజాతరలో సీఎం
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
”కేసీఆర్‌.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ చేసి చూడు.. మాడి మసై పోతావ్‌.. పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణను చెరబట్టినారు.. అధికార మార్పిడితో కారు అనుం చెడ్డది.. తూకానికి అమ్మేరు.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిన్ను ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపిస్తే.. మా పాలమూరుకు ఏం చేశావ్‌.. మేము ఆగస్టులోగా ముదిరాజ్‌ బిడ్డను మంత్రిమండలిలోకి తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం నామినేషన్‌ వేసిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ దగ్గర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా, ఉద్యోగాలను భర్తీ చేయకుండా నియంతలా పాలన కొనసాగించారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టి 100 మీటర్ల లోతున పాతర పెట్టారన్నారు. ఇది వరకు ఎంపీగా ఉన్న మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఐదేండ్లపాటు ఢిల్లీలో ఉండి ఏ ఒక్క పనీ చేయలేదని.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడం సిగ్గు చేటన్నారు. మరో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడీల దొరసానిని ఈ ప్రాంత ప్రజలు ఏనాడూ నమ్మరని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గడీల ముందు ఉండే బానిస కాలం చెల్లిందని, మిమ్ములను తొక్కి విజయం సాధించి ఢిల్లీకి కాంగ్రెస్‌ ప్రతినిధులను పంపిస్తామన్నారు. ఐదేండ్లపాటు అధికారంలో ఉండాలని ప్రజలు తమకు అవకాశమిస్తే.. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి 100 రోజుల్లోనే కూల్చాలని అనుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్‌ కథలకు కాలం చెల్లింది.. ఆయన మాటలు ఇక చెల్లుబాటు కావని విమర్శించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేడి జత కట్టార ని, తెలంగాణ ప్రజలు రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిట శ్రీహరి, పర్నికారెడ్డి, అనిరుద్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎంపీ మల్లురవి, మాజీ ఎంపీ జితేంద ర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఓబేదుల్లా కొత్వాల్‌ పాల్గొన్నారు.
మోడీ, కేడీ తోడు దొంగలు
మహబూబాబాద్‌ ఎప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటేనని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బలరాంనాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్రమోడీ తప్పు పట్టారని, తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టుగా మాట్లాడిన మోడీకి తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని నరేంద్రమోడీని, కిషన్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో ఉండే మోడీ ఇక్కడ ఫాం హౌస్‌లో ఉండే కేడీ ఇద్దరు తోడు దొంగలేనని అన్నారు. మహబూబ్‌నగర్‌, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, జహీరాబాద్‌, భువనగిరి పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దించిందన్నారు. బిడ్డ బెయిల్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కేసీఆర్‌ ఇచ్చే కమిషన్‌లకు మోడీ కక్కుర్తిపడ్డాడని అందుకే కాళేశ్వరంలో జరిగిన అంత అవినీతిపై కేసు పెట్టి జైలుకు పంపలేకపోయారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మూసి వేసింది ఈ బీజేపీ నేతలుకాదా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ కాజీపేటకు రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని మంజూరి చేస్తే నరేంద్ర మోడీ ఆ ఫ్యాక్టరీని లాహౌర్‌కు తరలించారన్నారు. జూన్‌ 4వ తేదీన 14 మంది ఎంపీలను గెలిపించుకొని జూన్‌ 9న జరిగే ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిగా చూడబోతున్నామన్నారు. పోరిక బలరాంనాయక్‌ సామాన్యుడని, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని, ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బీజేపీ పార్టీకి గతంలో గెలుచుకున్న ఆ నాలుగు సీట్లు కూడా ఇప్పుడు దక్కవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే భారతరాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర పన్నిందని మంత్రి దనసరి అనసూయసీతక్క అన్నారు.

Spread the love