– అన్నారం సుందిళ్లదీ అదే దారి
– రాష్ట్రానికి మోయలేని భారంగా మారిన వైనం
– కాళేశ్వరం ప్రాజెక్టులో 50 వేల కోట్ల అవినీతి
– మేడిగడ్డ నుంచి ఊరగొండ మల్లేశం
”కమీషన్ల కోసం ప్రాణహిత చేవెళ్లకు పాతరేశారు. తిరిగి ఆ ప్రాజెక్టును తుమ్మిడి హట్టి వద్ద నిర్మిస్తాం. నిపుణుల కమిటీ అభిప్రాయాలను తీసుకుంటాం. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది. అధికారులూ తప్పులు చేశారు. ఎంతటి వారినైనా వదిలిపెట్టబోం. క్యాబినెట్లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం’‘
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం వేల కోట్లను దుర్వినియోగం చేసిందనే అపవాదును మూటగట్టుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తుమ్మడిహట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసం కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 152 మీటర్ల ఎత్తుకు అభ్యంతరం చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపడంలో గత ప్రభుత్వం విఫలమైందనే వాదనలూ ఉన్నాయి. సొంత ప్రయోజనాల కోసం తానే పెద్ద ఇంజినీర్‌గా అవతారమెత్తి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు మోయలేని భారంగా మారిందంటూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ ప్రాజెక్టుకు గుండెకాయ అయిన మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అన్నారం బ్యారేజీకి బుంగలు పడగా, సుందిళ్ల ప్రాజెక్టు భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై నిర్మించిన మూడు బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని తెలంగాణ సమాజానికి తెలియజేయాలని కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా శనివారం భూపాలపల్లి జిల్లా మేడిగడ్డను పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఆ సందర్భంగా పరిశీలనకు వచ్చిన అంశాలు ఎన్నో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ప్రాజెక్టు భద్రతపై ఎన్డీఎస్ఏ ఆందోళన
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు సైతం నాణ్యత లోపంతో ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యంతో బ్యారేజ్ కుంగిందని రిపోర్టులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణపై వాస్తవాలను దాచిపెట్టిందని నివేదిక తెలిపింది. ఇన్‌స్ట్రూమెంటేషన్, వర్షాకాలం ముందు, ఆ తర్వాత తనిఖీ రిపోర్టులు, కంప్రెషన్, క్వాలిటీ, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులతోపాటు భౌగోళిక సమాచారం అందించలేదని విశదీకరించింది.
‘పునరుద్ధరణ’పై చేతులెత్తేసిన సీడీవో
మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, రీడిజైన్‌పై తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చేతులెత్తేసింది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ సంస్థ అందుకోలేదనీ, మేడిగడ్డ పునరుద్ధరణ డిజైన్‌ను చేపట్టలేమని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోగానీ, మరేదైనా ఇతర ప్రతిష్టాత్మక సంస్థతోగానీ డిజైన్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీడీవో సూచించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంతోపాటు రాష్ట్రంలోని పలు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల డిజైన్లను రూపకల్పన చేసిన ఈ సంస్థ తాజాగా పునరుద్ధరణ తమతో కాదంటూ తెలపడం వివాదాస్పదంగా మారింది. ప్రాజెక్టుల డిజైన్ తర్వాత మోడల్ స్టడీస్ నిర్వహిస్తారు. దాని పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాతే ఏ ప్రాజెక్టు నిర్మాణాన్ని అయినా చేపడతారు. అయితే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ విషయాల్లో అలాంటి నిబంధనలు పాటించలేదని తెలిసింది. గత ప్రభుత్వం ఒత్తిడితో ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో మోడల్ స్టడీస్ పూర్తికాకుండానే డిజైన్లను తీసుకుని గుత్తేదారులతో సంబంధిత ఇంజినీర్లు పనులు చేయించారని తెలిసింది. ఫలితంగా నాణ్యత లోపించి బ్యారేజ్ కుంగడానికి కారణమైందని ఎన్డీఎస్ఏ నివేదికనిచ్చింది. దీంతో సీడీవో పునరుద్ధరణపై చేతుతెల్తేసిందని సమాచారం.
నిర్మాణ బాధ్యత ఎవరిది..?
నాణ్యత లోపంతో ఈ యేడాది అక్టోబరు 23న కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పునర్నిర్మాణం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. డిఫెక్ట్ లైయబులిటీ పీరియడ్ అనేది 29.06.2022న పూర్తయింది. అందువల్ల పునర్నిర్మాణ బాధ్యత తమది కాదంటూ ఎల్‌అండ్‌టి కంపెనీ చేతులెత్తేసింది. ప్రమాదం సంభవించిన ప్రాంతంలో సమాంతరంగా కాపర్ డ్యాం నిర్మాణానికి రూ.55 కోట్లు, పునర్నిర్మాణానికి రూ. 500 కోట్లు ఖర్చు అవుతాయని ఆ సంస్థ తెలిపింది. ఆ డబ్బును చెల్లిస్తే తాము పనులు చేపడతామంటూ తేల్చి చెప్పింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సంబంధిత డీఈలు నిర్మాణ లోపాలపై గత ఏప్రిల్‌లో ఇచ్చిన నివేదికను బీఆర్ఎస్ ప్రభుత్వం తొక్కి పట్టిందనీ, అందువల్ల ఎల్అండ్టీ పనులు చేయాల్సిందేనంటూ హుకూం జారీ చేసింది. కాంట్రాక్టర్లు, ప్రభుత్వానికి మధ్య విభేదాలెలా ఉన్నా… రాబోయే జూన్ నాటికి పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే నీటి నిల్వ సాధ్యం కాదని నిపుణులు అభిప్రాయపడుతుండటం గమనార్హం.
కంట్రోల్ యూనిట్లు ఎందుకు మునిగాయి..?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయర్లయిన మేడిగడ్డ, అన్నారం కంట్రోల్ యూనిట్లు 2022లో వచ్చిన వరదల్లో మునిగిపోయాయి. ఫలితంగా ప్రాజెక్టు నిర్వహణపై తీవ్ర ప్రభావం పడడంతోపాటు ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. మేడిగడ్డ ప్రాజెక్టు కంట్రోల్ యూనిట్‌ను 126 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలంటూ డిజైన్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వ 120 మీటర్ల ఎత్తులోనే ఏర్పాటు చేయటం గమనార్హం. అలాగే అన్నారం ప్రాజెక్టు కంట్రోల్ యూనిట్‌ను 131 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను తోసిరాజని 125 మీటర్లలోనే దాన్ని ఏర్పాటు చేశారు. ఫలితంగా 2022లో కురిసిన భారీ వర్షాల వల్ల ప్రవాహం ఎక్కువై రెండు ప్రాజెక్టుల కంట్రోల్ యూనిట్లు నీట మునిగాయి. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే గత బీఆర్ఎస్ సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.