సెంథిల్‌ బాలాజీ అరెస్టు చట్టబద్ధతపై చీలిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు

చెన్నై : మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ భార్య వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ (హెచ్‌సిపి)పై మద్రాసు హైకోర్టు మంగళవారం విభజన తీర్పునిచ్చింది. గత నెల 14న ఇడి అధికారులు మంత్రిని అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీ కింద ఆయన ప్రైవేట్‌ ఆస్పతిలో వున్నారు. మంత్రి సతీమణి వేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించాలని న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ జె.నిషా బాను పేర్కొన్నారు. మంత్రిని అరెస్టు చేయడానికి ముందు అనుసరించాల్సిన చట్టపరమైన పద్దతులు అనుసరించడంలో ఇడి విఫలమైనందున వెంటనే ఆయనను విడుదల చేయాలంటూ జూన్‌ 14నే సెషన్స్‌ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌లోనే వుంచినందున ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టవచ్చని పేర్కొన్నారు. సెషన్‌ న్యాయమూర్తి ఆదేశాల కారణంగా మంత్రిని కస్టడీలో ఇంటరాగేట్‌ చేయడానికి ఇడికి అధికారం లేదని న్యాయమూర్తి బాను పేర్కొన్నారు.
ఇక మరోవైపు జస్టిస్‌ డి.భారత చక్రవర్తి మాట్లాడుతూ, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌తో విభేదించి తోసిపుచ్చారు. దీనిపై విచారణ చేపట్టలేమన్నారు. సంపూర్ణ చట్టవిరుద్ధమైన కేసుల్లో లేదా పూర్తిగా మనస్సు పెట్టకపోవడం లేదా వారి పరిధిలో లేకపోవడం లేదా ప్రాధమిక హక్కులు పూర్తిగా ఉల్లంఘించబడిన కేసుల్లో మినహా హెచ్‌సిపి విచారణయోగ్యం కాదని జస్టిస్‌ చక్రవర్తి పేర్కొన్నారు. ప్రస్తుత విషయంలో, అసాధారణ అధికారాలను వినియోగించడానికి గానూ పిటిషనర్‌ పైన పేర్కొన్నటువంటి ఏ ఒక్క కారణాన్ని కోర్టుకు విన్నవించలేదన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను తోసిపుచ్చాలని పేర్కొన్నారు.
పైగా మంత్రిని ఆ రాత్రి చేర్చిన తమిళనాడు ప్రభుత్వ మల్టి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నుండి కావేరీ ఆస్పత్రికి తరలించాల్సిందిగా జూన్‌ 15న తాను, జస్టిస్‌ బాను ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్క నిముషం కూడా మంత్రిని విచారించలేకపోయినందున మరో పది రోజులు లేదా డిశ్చార్జ్‌ అయ్యే లోపు ఏది ముందు వస్తే అది కొనసాగించాలని జస్టిస్‌ చక్రవర్తి ఆదేశించారు. ఒకవేళ అవసరమనుకుంటే జైలు ఆస్పత్రిలో చేరాలన్నారు. ఈ నేపథ్యంలో మూడో న్యాయమూర్తి ఈ కేసును విచారించాల్సి వుంది.

 

Spread the love