మహిళల పట్ల మహనీయుని ఆలోచనలు


‘ఇంటి పనుల కోసమే ఇల్లాలు. భర్తను ఆమె
సుఖపెట్టాలి. ఆమె అవసరాలు భర్త తీర్చాలి. ఇది సామాజిక ఒప్పందం. దీనికి కట్టుబడి ఉన్నంత వరకే కాపురం. ఉల్లంఘిస్తే భర్త భార్యను విడిచిపెడతాడు’ ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ తాజా వ్యాఖ్యలు. కానీ, ‘భార్యాభర్త లిద్దరూ ఉద్యోగాలలో, వృత్తులలో చేరితే బిడ్డల పోషణ, సంరక్షణ, ఇంటిపనులు నిర్వహించడంలో ఇబ్బందులు వుండవచ్చు. ఇద్దరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఆ పనులనన్నింటిని పంచుకొని ఓపికగా చేసుకోవాలి. తమ స్త్రీల మీద బరువును తగ్గించాలనే ధోరణి పురుషులలో ముఖ్యంగా యువకులలో రావాలి’ అన్నారు స్త్రీ సమానత్వం కోసం తుది వరకు తపించిన పుచ్చలపల్లి సుందరయ్య. మహిళల పట్ల ఎవరి ఆలోచన ఎలా ఉందో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. సమాజం చూపుతున్న వివక్షను ప్రశ్నించిన మహనీయుడు సుందరయ్య. తన జీవన సహచరి లీలమ్మను స్త్రీ విముక్తి ఉద్యమాలకు అంకితం చేసిన స్త్రీ పక్షపాతి. ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా మహిళల పట్ల ఆ మహనీయుని ఆలోచనలు ఓసారి మననం చేసుకుందాం…

తమ సంబంధం జీవితాంతం కొనసాగాలని ప్రతి జంటా కోరుకుంటుంది. తమ బిడ్డలను ప్రేమ – ఆదరాభిమానాలతో అభివృద్ధి చేయాలనుకుంటారు. కాని ఈ ఆకాంక్షలను పూర్తి చేసుకోడానికి పాత సామాజిక పరిస్థితులు తోడ్పడడం లేదనేది వాస్తవం. ఒక కులం, ఒక తెగ, ఒక మతం లేదా ఆర్థికంగా ఒకే అంతస్థులోనే వివాహ సంబంధాలు ఏర్పరచుకోవాలనేది అయా కాలంలో, ఆయా దేశాలలో ఏర్పడిన నిబంధనలు. అయితే వివాహబంధం వున్నప్పటికీ, ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గి, మరోవ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకోవడం పారంపర్యం గా వస్తూనేవుంది. అయితే పురుషుడు ఈ పనిచేస్తే సంఘం చూసీచూడకుండా ఉంటుంది. స్త్రీ చేస్తే అది తప్పుగా, పాపంగా, చెడిపోయిందిగా సంఘం నిరసిస్తూ వచ్చింది.
స్త్రీ చేస్తే పాపం
నియమాలు, ఆచారాలు ఎంతగా అమలు జరగడానికి ఎంతగా పూనుకున్నా స్త్రీ ఆర్ధికంగా తన జీవితాన్ని తానే గడుపుకోగల్గిన స్థితి వచ్చేకొద్దీ భగమైపోతున్నాయి. వరకట్నాలు, తల్లిదండ్రులు ఎంచి ఏర్పాటుచేసే వివాహాలు, ఒకే వర్ణంలో పెండ్లి జరగాలనే ఆచారాలు, స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం, తగిన విద్య, స్వతంత్రం పెరిగేకొద్దీ మటుమాయమవుతున్నాయి. పరస్పర పరిచయంతో, పరస్పర ఆదరాభిమానాలు, గౌరవంలో వైవాహిక సంబంధాలేర్పరచుకుంటారు. అయినా అలా జరిగిన వివాహాలు కూడా కలిసి జీవించేటప్పుడు, ఆర్థిక హక్కుతోగానీ, కలసి మెలసి నివసించడంలో పరస్పర సహకారం, తోడ్పాటు, గౌరవం, ఆదర లోపించినప్పుడుగాని భగమవుతున్నాయి. అప్పుడు ఐచ్ఛికంగా విడిపోవడం, విడాకులు ఇచ్చుకోవడమే నిజమయిన నీతి. ఒక సారి వివాహం విచ్ఛిన్నమయితే మరోసారి తిరిగి వైవాహిక సంబంధాలు మరొకరితో పెట్టుకోవడం సహజమని చూడాలి. స్త్రీ అలాచేస్తే పాపమని, తప్పుని అనుకొనే మూఢాచారంపోవాలి.
తేలిక మనుషులవుతారు
           తాత్కాలిక ఆకర్షణలకు లోనయిన యువతీ యువకులు గాని, స్త్రీ పురుషులు గాని సంబంధాలు పెట్టుకోవచ్చు. అంతమాత్రాన స్త్రీ చెడిపోయిందనీ, అలాంటి సంబంధాలకు లోనయిన స్త్రీ, పురుషులు నీతి బాహ్యులని అనుకోవడం కూడా తప్పే. అయితే అలాంటి సంబంధాలనే పదేపదే తాత్కాలింగా పెట్టుకునేవారు, పదే పదే తాత్కాలిక ఆకర్షణలకు లోబడేవారు మాత్రం తమ వ్యక్తిగత జీవితాన్నిగాని, సామాజిక జీవితాన్నిగాని ఉపయోగప్రదంగా నడుపుకోలేని తేలిక మనుషులుగా పరిగణింపబడతారు.
పూర్తి మార్పు వస్తేనే…
జీవితం గడువక తన దేహాన్ని డబ్బుకు అమ్ముకోవలసి వచ్చే స్త్రీలు, క్రమక్రమంగా దానికి అలవాటు పడిపోయే వారు వున్నారు. సమాజంలో పూర్తి మార్పు తీసుకునిరానిదే వారిని సరియయిన మార్గంలో పెట్టలేము. స్త్రీ శారీరక స్వభావాన్ని బట్టి పురుషుడు బలాత్కారం చేయడం సాధ్యమవుతుంది. దాని పర్యవసానంగా గర్భవతులు కావడం కూడా జరుగుతుంది. అలాంటి వారిని, స్త్రీలను బలాత్కరించేవారిని కఠినంగా శిక్షించాలి. ఏ ఆర్థిక రాజకీయ దృక్కోణము నుండి అయితేనేమీ, సమాజం వివిధ దశలలోను దీనిని తీవ్రనేరంగా పరిగణిస్తూవచ్చింది. అలాంటి స్త్రీలు తమకిష్టంలేని గర్భాన్ని తీసివేయించుకోడానికి పూర్తి స్వేచ్చ గలిగివుండాలి.
తిరిగి కృషి చేయాలి
స్త్రీకి వివాహబంధంతో నిమిత్తంలేకుండా సంతానం కలిగినా దానిని నేరంగా, పాపంగా భావించరాదు. ఆమె బిడ్డకు సర్వసాధారణ సమానహక్కులుండాలి. ఏ స్త్రీ అయినా తనకిష్టం వచ్చిన పురుషునితో సంబంధం పెట్టుకున్న తర్వాత తన భ్రమలు, ఆశలు భగమయి విడిపోయినా ఇక జీవితమంతా చెడిపోయిందనే అభిప్రాయానికి తావుయివ్వక తన జీవితాన్ని సంతోష ప్రదంగా, ఉపయోగప్రదంగా నడుపుకోడానికి తిరిగి కృషిచేయాలి. సమాజం – పురుషులు ముఖ్యంగా యువకులు దానికి తగిన అవకాశం కలిగించాలి. పురుషుని యెడల చూపే ఔదార్యం, సహనత, న్యాయం స్త్రీ పట ్లకూడా చూపాలి. అలాగే కుటుంబ నియంత్రణ పద్ధతులు. పరిమిత కుటుంబం వల్ల స్త్రీ ఆరోగ్యానికి, కుటుంబం ఆర్థికంగా సుఖంగా జీవించడానికి తగిన అవకాశం వుంటుంది. తక్కువమంది బిడ్డలయితే తగిన విద్యా శిక్షణ, ఉపాధులు కలిగించడం సాధ్యమవుతుంది. వీనిని గూర్చి కూడా బోధించాల్సి వుంటుంది.
ఆర్ధిక స్వయం పోషణ అవసరం
స్త్రీ పురుషులు సమాన గౌరవాదరణలతో, పరస్పర అభిమానాలతో జీవించాలంటే ఇద్దరూ ఆర్ధికంగా స్వయం పోషకంగా ఉండటానికి కావలసిన వృత్తులు, ఉద్యోగాలు చేసుకోవడానికి అలవాటు పడాలి. కుటుంబ జీవితం ఆర్థికంగా సవ్యంగా, తేలికగా జరగడానికి ఒక ఆర్జనమీద కన్నా ఇరువురి ఆర్జనవల్ల తేలిక అవుతుంది. నేటి పరిస్థితులలో ఇరువురు ఆర్జించటం అత్యవసరమవుతుందనేగాక పరస్పర గౌరవం, సమాన హోదాతో కుటుంబం నడవడానికి కూడా ఇది అవసరం. పైగా స్త్రీ పురుషులిరువురూ ఆర్జించడం వల్ల, మొత్తం దేశ ఆర్థికోత్పత్తి పెరిగి సమాజ మంతా త్వరత్వరగా అన్ని విధాల అభివృద్ధి పొందడానికి తోడ్పడుతుంది. సోషలిస్టు దేశాలన్నింటిలోనూ స్త్రీ పురుషులం దరూ పనిచేసే అవకాశాలుండ బట్టే అక్కడ స్త్రీ సమాన కుటుంబ భారాన్ని కలిగి వుండి, పెట్టుబడిదారీ దేశాలకన్నా సున్నితంగా ముందుకు పోతూ వుంటుంది.
ఇంటి బాధ్యతలు పంచుకోవాలి
భార్యభర్తలిద్దరూ ఉద్యోగాలలో, వృత్తులలో చేరితే బిడ్డలపోషణ, సంరక్షణ, ఇంటిపనులు నిర్వహించడంలో ఇబ్బందులు వుండవచ్చు. కాని ఇద్దరూ కలిసి ఒకరికొకరు సహాయంచేసుకుంటూ, ఆ పనులనన్నింటిని పంచుకొని ఓపికగా చేసుకోవాలి. స్త్రీయే ఇంటి పనులన్నింటినీ చూడాలనడం సరికాదు. ఇతర బాధ్యతలతోపాటు తమ తమ ఉద్యోగాలు, వృత్తులతోపాటు, ఇంటిపనులన్నిటినీ కూడా పురుషులు కూడా పంచుకొని చేయాలి. తమ స్త్రీల మీద బరువును తగ్గించాలనే ధోరణి పురుషులలో ముఖ్యంగా యువకులలో రావాలి.
అప్పుడే నూతన సమాజం సాధ్యం
ఇవన్నీ సోషలిస్టు సమాజంలో అది కూడా బాగా అభివృద్ధి చెందిన దశలోనే పూర్తిగా సాధ్యమవుతాయి. అలాంటి సమాజాన్ని నిర్మించే వరకు యువజనులు ముఖ్యంగా యువకులు తమ వ్యక్తి జీవితాన్ని, స్త్రీల యెడల తమ ప్రవర్తనను తాము చదువుకునే కాలంలోను, తమ వైవాహిక జీవితంలోను, కుటుంబ జీవితంలోను ఈ దృక్కోణంతో, ఈ ఆశయంతో మలచుకోవాలి. అప్పుడే వారు కోరుకునే నూతన రాజకీయాల కోసం నేటి దోపిడీ సమాజంలోని కుళ్ళు రాజకీయాలను, నీతినియమాలను అధిగమించి పనిచేయగలుగుతారు.
స్త్రీ కూడా మనిషే
సహవిద్య, యువతీ యువకులు కలసి మెలసి ఆటలు, పాటలు, సామాజిక చర్యలను ప్రోత్సహించాలి. అవి తప్పుదారులకు, తాత్కాలిక ప్రలోభాలకు దారితీస్తాయనే భయంతో తలుపులు బిగించి నీతి నియమాలు పాటింపజేయడం అసంభవం. స్త్రీ ఒక ఆటవస్తువుకాదు. స్త్రీ కూడా ఒక మనిషే. పురుషుని వలె ఆత్మాభిమానాలు గలిగి తన బాగోగులు చూచుకోగల మనిషి అనే అవగాహన వుండాలి. పురుషునికి వర్తింపజేసే ప్రమాణాలే స్త్రీ యెడల కూడా వర్తింపజేస్తే ఈ భయాలుండవు. అయితే స్త్రీకి వున్న ప్రత్యేక దేహ లక్షణాలు, బిడ్డలు కనడమన్న విశిష్ట బాధ్యతను అవకాశంగా తీసుకొని ఆమెను అణచిపెట్టకుండా వుండటానికి తగిన అదనపు రక్షణలు, సౌకర్యాలు ఆమెకు కలుగజేయాల్సి వుంటుంది.
– సుందరయ్య రచనల సంకలనం నుండి

Spread the love