న్యూఢిల్లీ : తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో భారత జాతి పిత మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె ఎం. సాహ్ని హాజరయ్యారు. తొలిత జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అందరూ బాపూజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎం. సాహ్ని మాట్లాడుతూ ”దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అమూల్యమైన సేవలు, త్యాగాలు చేసారన్నారు. ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్పూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నదని ఆయన తెలిపారు. రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ ”మహాత్మా గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, సత్యం, అహింస అనే ఆయుధాలతో గాంధీ జీవితంలో అనేక విజయాలు సాధించారని అన్నారు. మహాత్మా గాంధీ జీవితం నుంచి మనమంతా ప్రేరణ పొందాలని, వారి ఆశయాలను పాటించాలని అన్నారు. గాంధీజీ జీవనాన్ని పరిశీలిస్తే మనం ఎలా ఉండాలో, ఉండకూడదు తెలుస్తుందని తెలిపారు. శాంతి యుతంగా అనేక ఉద్యమాలు చేశారని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి నినాదాలతో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విజయం సాధించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సంజరు జాజు, ఇతర భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.