– సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులు
– బెడ్లు లేక నేలపైనే పడక ఊడిన కిటికీలు, విరిగిన తలుపులు
– చలి,గాలి,వానకు ఇబ్బందుల గురవుతున్న విద్యార్థులు
– పట్టించుకోని పాలకులు, అధికారులు
నవతెలంగాణ-తాండూరు
సమాజానికి మంచి పౌరులను అందించాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడు గదులు లేకపోవడంతో చేసేది ఏమీ లేక విద్యార్థులు సమస్యలతోనే కాలం వెలదీస్తున్నారు. గురుకులాలను సందర్శించాల్సిన సంబంధిత అధికారులు అటు కన్నెత్తి చూడకపోవడంతో రోజురోజుకు గురుకుల పాఠశాలలో సమస్యలు అధికమవుతున్నాయి. గత ప్రభుత్వం అద్దె భవనాలలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడంతో ఇక్కడ విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. పట్టణ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడు గదులు లేక, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు సమస్యలతోనే కాలం వెలదీస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు పడుకునే గది కిటికీలకు డోర్లు లేకపోవడంతో విద్యార్థులు కిటికీలకు గోనె సంచులు కట్టుకొని ఎండ, వాన, చలికి కాలం వెలదీస్తున్నారు. గురుకుల పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం సైతం లేదు. గురుకుల పాఠశాలకు వెళ్లాలంటే మురుగు నీటిలోనే నడవాల్సిందే. రేకుల షెడ్డులోని విద్యార్థులు కాలం వెలదీయాల్సి వస్తుంది. తాండూర్‌లోని జ్యోతిరావు గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకుల పాఠశాలకు 480 సీట్లు మంజూరు ఉన్న ప్రస్తుతం మాత్రం కేవలం 450 మంది విద్యార్థులనే అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సరిపడ ఉపాధ్యాయులు లేరు. దీంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సమస్యలు ఉన్నది వాస్తవం. సరిపడిన గదులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవడంతో వరండాలలోనే తింటున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కరం కావచ్చు.
నరేష్ ప్రిన్సిపాల్