స్కిల్‌ వర్సిటీకి ఏర్పాట్లు చేయండి

To Skill Varsity Make arrangements– 23లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయండి : అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ముందే, జులై 23వ తేదీ లోపు దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని పరిశ్రమలు, విద్యాశాఖల అధికారులకు చెప్పారు. దీనికి పారిశ్రామికరంగ ప్రముఖులు సహకారం అందించాలని కోరారు. ప్రతిపాదనలు వచ్చిన 24 గంటల్లో వాటిని పరిశీలించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటు కోసం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ ప్రాంతం ఐటీ కంపెనీలతో పాటు పరిశ్రమలకూ అందుబాటులో ఉన్నందున ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఐఎస్‌బీ తరహాలో ఒక బోర్డును ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. దీనిపై సీఎం స్పందిస్తూ సమావేశానికి హాజరైన ప్రతినిధులందరినీ తాత్కాలిక బోర్డుగా భావించాలని నిర్ణయం తీసుకున్నారు. స్కిల్‌ యూనివర్సిటీలో ఉండాల్సిన కోర్సులు, పాఠ్యాంశాలు, పరిశ్రమల అవసరాలు తెలుసుకొని, దానికి అనుగుణంగా, ఆధునిక పరిజ్ఞానంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా, నైపుణ్య శిక్షణా తరగతులు ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులమ్‌, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ, కేవలం 15 రోజుల వ్యవధే ఉన్నందున ప్రతి ఐదు రోజులకోసారి సమావేశం కావాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలా? లేక ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టాలా? మరేదైనా విధానం అనుసరించాలా? అనే విషయాలను కూడా పరిశీలించాలని చెప్పారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్‌ను నియమించుకోవాలనీ, దీనికి పరిశ్రమల శాఖ నోడల్‌ డిపార్టుమెంట్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. సమావేశంలో ఐటీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్‌ స్పెషల్‌ సెక్రెటరీ విష్ణువర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్‌ చైర్మెన్‌ సతీష్‌రెడ్డి, భారత్‌ బయోటెక్‌ హరిప్రసాద్‌, క్రెడారు ప్రెసిడెంట్‌ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్‌ శ్రీనిరాజు తదితరలు పాల్గొన్నారు.

Spread the love