
నవతెలంగాణ – పెద్దవూర
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా 21వ మహాసభలు డిసెంబర్ 2,3,4 తేదీల్లో మిర్యాలగూడలో జరగనున్నాయని ఆ మహాసభల జయప్రదానికి ప్రజలందరూ సహకరించాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రం లో జిల్లా మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 2న భారీ బహిరంగ సభ ఎనిర్వహిస్తున్నామని 3,4 తేదీల్లో జరిగే మహాసభల్లో జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమం రూపొందిస్తామని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్ డిఎ నాయకత్వంలోని మోడీ సర్కార్ ప్రైవేటీకరణ మతోన్మాద విధానాల్ని మరింత ముందుకు తీసుకుపోతుందని విమర్శించారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు ద్వారా దత్తం చేస్తుందని విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించి మాటలతో కాలయాపన చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ మహాసభల్లో కార్యచరణ రూపొందిస్తామని అన్నారు. నేడు పెద్దవూర మండల కేంద్రంలో జరిగే పార్టీ ఎనిమిదో మండలం మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, నాయకులు ఎస్ కె బషీర్, దొరపల్లి మల్లయ్య, తరి రామకృష్ణ, ఎస్ కే మైనుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.