కూలిపోయిన మలావీ ఉపాధ్యక్షుడి విమానం..?

నవతెలంగాణ-హైదరాబాద్ : మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది ప్రయాణిస్తున్న విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే, అది అక్కడి పర్వత ప్రాంతాల్లో కూలిపోయి ఉండవచ్చని ఆ దేశ సైన్యం పేర్కొంది. విమానం ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదని తెలిపింది. సైనికులతో పాటు పోలీసులు, వందల మంది అటవీ అధికారులతో ముమ్మర గాలింపుచర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. గల్లంతైన విమానం కోసం భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టామని.. దట్టమైన అడవి కావడం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణం ఇందుకు అడ్డంకిగా మారిందని మలావీ సైన్యం పేర్కొంది. ఉపాధ్యక్షుడి విమానాన్ని గుర్తించేందుకు అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయం కోరినట్లు ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా, బ్రిటన్‌, నార్వే, ఇజ్రాయెల్‌ కూడా ఈ ఆపరేషన్‌లో సహాయం అందించేందుకు ముందుకువచ్చాయని వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ముగ్గురు సైనిక సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.

Spread the love