మత విశ్వాసాలను కించపర్చడం మా ఉద్దేశం కాదు: మల్లికార్జున్‌ ఖర్గే

నవతెలంగాణ – న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రముఖలకు ఆహ్వనాలు అందయి. ఈ ఆహ్వానాలు అందుకున్న వారిలో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు అధిర్‌ రంజన్ చౌధరి కూడా ఉన్నారు. అయితే, ఆహ్వానాలు అందినప్పటికీ ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాము హాజరుకాబోమని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు ఒకరితర్వాత ఒకరు విమర్శలు చేస్తున్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందినా కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించడమంటే మత విశ్వాసాలను కించపర్చడమేనని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై తాజాగా మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. సాధారణ ఎన్నికల ముందు ఓట్ల కోసం బీజేపీ కుట్రపూరితంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ రాజకీయ ప్రోగ్రామ్‌ కాబట్టే తాము ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకాబోమని ప్రకటించామని చెప్పారు. తాము అయోధ్య పర్యటనను బహిష్కరించడం లేదని, ఈ నెల 22న అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని మాత్రమే బహిష్కరిస్తున్నామని అన్నారు.

Spread the love