నవతెలంగాణ-హైదరాబాద్ : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ విధానం ఆచరణీయం కాదని, ఆచరణ సాధ్యంకాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఖర్గే అభివర్ణించారు. ‘‘ఇది జరగదు. ఈ విధానాన్ని ప్రజలు ఆమోదించరు’’ అని ఆయన అన్నారు. వచ్చే నెలలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదినకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రతిపాదిత ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్‌తో సహా మొత్తం 15 విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.