న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల వేళ మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయితీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించాయి. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా ఆయా పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో ఒకేరోజులో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు జరగాలన్నదే హైకోర్టు ఆదేశాల వాస్తవ ఉద్దేశమని స్పష్టం చేసింది.